హైదరాబాద్, వెలుగు: జవహర్ నగర్ డంపింగ్యార్డు వద్ద త్వరలో మరో 28 మెగావాట్ల వేస్ట్ టు ఎనర్జి జనరేషన్ పవర్ప్లాంట్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. సోమవారం మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి సనత్ నగర్ ప్లే గ్రౌండ్ లో 1350 స్వచ్ఛ ఆటోలను ప్రారంభించి 250 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. జవహర్ నగర్ డంపింగ్ యార్డు వద్ద ఇప్పటికే 20 మెగావాట్ల ప్లాంట్ఉందని, మరో 28 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చిందన్నారు. త్వరలోనే ప్లాంట్ ఏర్పాటు కాబోతుందన్నారు. నగరాన్ని శుభ్రంగా ఉంచుతున్న శానిటేషన్ వర్కర్లు, సిబ్బందికి కేటీఆర్ అభినందనలు తెలిపారు. ‘సఫాయి అన్న సలామ్’ అంటూ సీఎం కేసీఆర్ మున్సిపల్ సిబ్బందికి మూడు సార్లు గౌరవ వేతనం పెంచారన్నారు. స్వచ్ఛ ఆటోల పంపిణీకి ముందు నగరంలో 3500 టన్నుల చెత్త వ్యర్థాలను సేకరించే వారని, ప్రస్తుతం ఇంటింటికి తిరిగి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరిస్తుండటంతో 6500 టన్నుల చెత్త వస్తున్నట్లు తెలిపారు. మంత్రి తలసాని మాట్లాడుతూ.. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఆర్ స్వచ్ఛ ఆటోలను అందిస్తుండటంతో సిటీ రోజురోజుకు క్లీన్ సిటీగా మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శ్రీలత, కమిషనర్ లోకేష్ కుమార్, అడిషనల్ కమిషనర్లు సంతోష్, ప్రియాంక అలా, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ రవి కిరణ్ పాల్గొన్నారు.
