హైదరాబాద్‌సిటీ, వెలుగు: వాటర్ బోర్డు సరఫరా చేసే తాగునీటితో వాహనాలు కడిగిన ఓ వ్యక్తికి అధికారులు రూ.10 వేల జరిమానా విధించారు. మంగళవారం వాటర్‌బోర్డు ఎండీ అశోక్ రెడ్డి బంజారా హిల్స్ రోడ్ నంబర్12లో మెయిన్‌రోడ్డుపై నుంచి వెళ్తుండగా ఓ వ్యక్తి కారు కడుగుతూ కనిపించాడు. దీంతో ఎండీ దగ్గరకు వెళ్లి చూసి ఆ నీళ్లు వాటర్‌బోర్డు సరఫరా చేస్తున్నవని గ్రహించారు.
దీంతో తాగునీటికి సరఫరా చేసే నీటిని ఇతర అవసరాలకు వినియోగిస్తుండడంతో అతడికి నోటీసు ఇచ్చి జరిమానా వేయాలని సంబంధిత మేనేజర్ ను ఆదేశించారు. ఎండీ ఆదేశాల మేరకు ఆ వ్యక్తికి రూ.10 వేలు ఫైన్ వేశారు. తాము ఎన్నో కష్టాలు పడి కిలోమీటర్ల దూరం నుంచి తాగునీళ్లను తీసుకువస్తుంటే కొందరు బాధ్యత లేని వారు కార్లు, బండ్లు, ఇండ్ల ముందు వాకిళ్లు కడగడానికి వాడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. ఇక ముందు ఎవరైనా తాగునీళ్లను ఇతర అవసరాలకు వినియోగిస్తే జరిమానా తప్పదని హెచ్చరించారు. అవసరమైతే కఠిన చర్యలకు కూడా వెనుకాడేది లేదన్నారు.
