ఫిర్యాదులను వాటర్​బోర్డు ఆఫీసర్లు అస్సలు పట్టించుకుంటలే

ఫిర్యాదులను వాటర్​బోర్డు ఆఫీసర్లు అస్సలు పట్టించుకుంటలే

పనులు చేసినట్లు ఫిర్యాదుదారుల ఫోన్లకు మెసేజ్​లు

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్​సిటీలోని తాగునీటి, డ్రైనేజీ సమస్యలపై వస్తున్న ఫిర్యాదులను వాటర్​బోర్డు ఆఫీసర్లు అస్సలు పట్టించుకోవడం లేదు. పరిష్కరించకుండానే పరిష్కరించినట్లు ఫిర్యాదుదారుల ఫోన్లకు మెసేజ్​లు పంపిస్తున్నారు. స్థానిక సమస్యలపై ఫిర్యాదు చేస్తే టోకెన్ నంబర్లు జారీ చేసి వదిలేస్తున్నారు. నెలల తరబడి సమస్యలు అలాగే ఉంటున్నాయి. పనులు చేయకుండానే చేసినట్లు ఎందుకు మెసేజ్​లు పంపిస్తున్నారని నిలదీస్తున్నప్పటికీ సమాధానం ఇవ్వడం లేదు. వీటిపై ట్విట్టర్ ​వేదికగా రోజూ చాలామంది ప్రశ్నిస్తున్నారు. పట్టించుకోవాల్సి అధికారులే ఇలా వ్యవహరిస్తే ఎలా అని వాపోతున్నారు. వాటర్​బోర్డుకు డ్రైనేజీ, తాగునీటి సమస్యలపై రోజూ 200కు పైగా ఫిర్యాదులు వస్తున్నాయి. 

సగం పైనే పెండింగ్

వాటర్​బోర్డు గ్రీవెన్స్ సెల్​కి ట్విట్టర్, ఆన్ లైన్, టోల్ ఫ్రీ నెంబర్ తో పాటు మ్యానువల్ గా రోజూ 200లకుపైగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఇందులో సగానికిపైగా పెండింగులోనే ఉంటున్నాయి. ఈ క్రమంలోనే పనులు చేయకుండానే చేసినట్లు అధికారులు టోకెన్​ నంబర్ ని క్లోజ్​ చేస్తున్నారు. మెహిదీపట్నంలోని సంతోశ్​నగర్ కాలనీకి చెందిన హబీబ్ పైపు లైన్ పనులు పూర్తి చేయడం లేదని ఫిర్యాదు చేయగా అధికారులు టోకెన్ నంబర్ 2016 ని జారీ చేశారు. త్వరగా పనులు పూర్తి చేస్తామని తెలిపారు. కానీ పనులు చేయకుండానే పూర్తిచేసినట్లు టోకెన్ నంబర్ క్లోజ్​చేసినట్లు ఫోన్​కు మెసేజ్ వచ్చింది. వెంగళ్​రావు నగర్ కి చెందిన రాజేశ్ సీవరేజీ ఓవర్ ఫ్లో అవుతుందని ఫిర్యాదు చేయగా ఆయకు 1,785 టోకెన్ నెంబర్ జారీ చేశారు. కానీ సమస్యను పరిష్కరించకుండానే పనులు చేసినట్లు టోకెన్​నంబర్ క్లోజ్ చేయడంతో ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలా రోజూ వస్తున్న వాటిలో సగానికిపైగా ఫిర్యాదులు క్లోజ్​చేస్తున్నట్లు తెలుస్లోంది.

ఉన్నతాధికారులు పట్టించుకుంటలే

గ్రీవెన్స్ సెల్​ పై ఉన్నతాధికారులు ఫోకస్ పెట్టకపోవడంతోనే ఇలా జరుగుతోందని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్లోజ్ చేసిన టోకెన్​ఆధారంగా  ఫిర్యాదుదారుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటే పూర్తి వివరాలు ఉన్నతాధికారులు తెలిసేందుకు వీలుంటుంది. అదేం లేకపోవడంతో కింది స్థాయి అధికారులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా గ్రీవెన్స్​సెల్ పై ఉన్నతాధికారులు ఫోకస్ ​పెట్టాలని జనం కోరుతున్నారు. 

అన్నిచోట్ల ఏదో ఒక సమస్య

వాటర్​బోర్డుకు ఫిర్యాదులు రాని ప్రాంతాలు అంటూ ఉండడం లేదు. సిటీలోని అన్ని ప్రాంతాల నుంచి రోజూ ఏదో ఒక సమస్య ఉందంటూ ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. వీటిలో ఎక్కువగా కలుషిత నీటిపై ఉంటున్నాయి. వరుస వానలతో ఈ సమస్య మరింత తీవ్రమైంది. నారాయణగూడలోని గాంధీ కుటీర్ బస్తీ, నారాయణరెడ్డి కాలనీ, షేక్ పేటలోని వినోభానగర్, జంగంమెట్ తదితర ప్రాంతాల నుంచి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. నెలల తరబడి సమస్యలు కొనసాగుతున్నాయని బాధితులు వాపోతున్నారు. డ్రైనేజీ, లోప్రెషర్ సమస్యలపై కూడా ఫిర్యాదులు ఉంటున్నాయి.

గ్రీవెన్స్​ సెల్​ ఎందుకు?

అధికారులకు ఫిర్యాదు చేసినా సమస్యలు తీరడం లేదు. గ్రీవెన్స్​సెల్​కి ఫిర్యాదులు వస్తే వెంటనే పరిష్కరించాలి. కానీ పనులు చేయకుండానే చేసినట్లు ఎలా చెబుతారు. ఇలాగైతే అధికారులపై నమ్మకం పోతుంది. ఇప్పటికైనా అధికారులు మారాలె. 

- శివచంద్రగిరి, ఉప్పుగూడ