వాటర్ బోర్డు.. స్పెషల్ ప్లాన్ 

వాటర్ బోర్డు.. స్పెషల్ ప్లాన్ 
  • వచ్చే  3 నెలలు నీటి సరఫరాపై పర్యవేక్షణ
  • మేనేజ్ మెంట్ స్ట్రాటజీకి అధికారుల నిర్ణయం
  •  సిటీలో నీటి కొరత రాకుండా తగు చర్యలు 
  •   డిమాండ్ ప్రాంతాల్లో వాటర్ ఫిల్లింగ్ పాయింట్స్  
  •  ట్యాంకర్ల బుకింగ్, పర్యవేక్షణకు స్పెషల్ అధికారులు 
  •  బుకింగ్ ట్రాకింగ్ కు ప్రత్యేక యాప్ ద్వారా మానిటరింగ్

హైదరాబాద్, వెలుగు :  గ్రేటర్​ సిటీలో మరో మూడు నెలలు తాగునీటి సరఫరాలో సమస్యలు రాకుండా వాటర్​ బోర్డు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందుకు మే, జూన్, జులై   నెలలకు నీటి సరఫరాలో తేడా లేకుండా చూడడంతో పాటు ట్యాంకర్​మేనేజ్​మెంట్​స్ర్టాటజీని అమలు చేసేందుకు అధికారులు నిర్ణయించారు. నగరంలో తాగునీటి కొరత లేకుండా చూడాలని సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించిన మేరకు అధికారులు తగు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఆరు రిజర్వాయర్ల నుంచి సిటీకి 500 ఎంజీడీల నీటిని సరఫరా చేస్తుండగా.. ఇంకొన్ని రిజర్వాయర్ల ద్వారా అదనంగా ఎక్కువ నీటిని డ్రా చేసేందుకు కూడా ప్లాన్ రూపొందించారు. ప్రధానంగా ట్యాంకర్లను ఎక్కువగా బుక్​ చేసుకునే  ఐటీ కారిడార్, ఓఆర్​ఆర్​ సమీప గ్రామ పంచాయతీలతో పాటు కాలనీలు, బస్తీలకు సరఫరాలో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నట్టు వాటర్​బోర్డు అధికారులు తెలిపారు. 

అదనంగా వాటర్ ఫిల్లింగ్ పాయింట్లు

ట్యాంకర్ మేనేజ్ మెంట్ స్ట్రాటజీని అమలులో భాగంగా  నీటి డిమాండ్​ అధికంగా ఉన్న ప్రాంతాలకు నీటి సరఫరా చేసేందుకు ఆయా ప్రాంతాలకు సమీపంలోనే అదనంగా వాటర్ ఫిల్లింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే 76  కొత్త ట్యాంకర్లను కూడా సమకూర్చున్నట్లు తెలిపారు.  ఆయా ప్రాంతాలకు 760 ట్యాంకర్లను ఏర్పాటు చేసుకుంది.  

బోర్డు పరిధిలో సరఫరాకు జీహెచ్ఎంసీ నుంచి డ్రైవర్ల సేవలను పూర్తిగా వినియోగించుకోవాలని కూడా నిర్ణయించారు. కస్టమర్ల నుంచి వచ్చే ట్యాంకర్ బుకింగ్స్, ఫాలో అప్ కు ఎంసీసీ పర్యవేక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందుకు ట్యాంకర్ బుకింగ్ ట్రాక్ చేయడానికి ప్రత్యేక యాప్ రూపొందించారు. ట్యాంకర్ల డిమాండ్ ఎక్కువగా ఉన్న  డివిజన్ 3, 6, 9, 15, 18 లలో స్పీడ్ గా సేవలు అందించేందుకు ప్రత్యేక అధికారులను నియమించారు. వీరు తమకు కేటాయించిన  డివిజన్లలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. 

అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించండి :  వాటర్ బోర్డు ఎండీ  

సిటీలో వాటర్ ప్రాబ్లమ్ ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు అధికారులు రోజూ క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఎండీ సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం సంబంధిత అధికారులతో ఖైరతాబాద్ లోని హెడ్డాఫీసులో  సమీక్షించారు. తాగునీటి సరఫరా, ట్యాంకర్ మేనేజ్ మెంట్ స్ట్రాటజీ, ఎంసీసీ కంప్లయింట్లు, చలివేంద్రాల నిర్వహణపై వివరాలను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. వాట్సాప్, ఫేస్ బుక్, ఎక్స్ వంటి సోషల్ మీడియా ద్వారా వచ్చే కంప్లయింట్లపైనా ఆరా తీశారు. ట్యాంకర్ ట్రిప్పుల సంఖ్య పెంచాలని, కలుషిత నీటిపై  ఫిర్యాదులు వస్తే.. వెంటనే స్పందించి పరిష్కరించాలని సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో చలివేంద్రాల సంఖ్య కూడా పెంచాలని, అధికారులు వాటర్ క్వాలిటీలో రాజీపడొద్దని, తగిన మోతాదులో క్లోరిన్ శాతం ఉండేలా చూడాలని తెలిపారు. వానాకాల ప్రణాళిక కోసం ప్రపోజల్స్ సిద్ధం చేసుకోవాలని, సీవరేజ్ ఓవర్ ఫ్లో సమస్యలు రాకుండా సీవర్​ జెట్టింగ్ మెషీన్లను వాడాలని అధికారులను ఆదేశించారు .