
హైదరాబాద్‌సిటీ, వెలుగు: గ్రేటర్‌పరిధిలో సరఫరా చేస్తున్న నీటికి సరైన లెక్కలు లేక బిల్లులు తక్కువగా వసూలవుతున్నాయి. గ్రేటర్‌పరిధిలోని 26 డివిజన్లలో 13.80 లక్షల నీటి కనెక్షన్లుండగా, రోజుకు 550 ఎంజీడీల నీటిని వాటర్‌బోర్డు సరఫరా చేస్తోంది. ఇందులోని అన్అకౌంటెడ్వాటర్కు ఇన్‌కం రావడం లేదు. సాధారణంగా నీటి సరఫరాలో లీకేజీలు, ఎండలకు ఎవాపొరేషన్(ఆవిరి) వంటి కారణాల వల్ల దాదాపు 15 నుంచి 20 శాతం నీటికి లెక్కలు ఉండవు. మిగిలిన 80 శాతం నీటిలో బోర్డుకు 45 నుంచి 50శాతం మాత్రమే బిల్లుల వసూలవుతున్నాయి.
నెలకు రూ.120 నుంచి రూ.130 కోట్లు రావాల్సి ఉండగా, రూ.100 నుంచి 110 కోట్ల వరకే వస్తోంది. మిగిలిన 30 శాతం నీటికి లెక్కలు ఉండడం లేదు. అంటే రిజర్వాయర్ల నుంచి సరఫరా అవుతుంది కానీ ఎక్కడికి వెళ్తుందో తెలియడం లేదు. దీనినే అన్అకౌంటెడ్వాటర్అని పిలుస్తుంటారు. అక్రమ కనెక్షన్ల ద్వారా నీటిని వాడుకోవడం, పైప్లైన్ల లీకేజీల వల్ల ఈ లెక్కలు తేలడం లేదని తెలుస్తోంది. దీంతో అన్అకౌంటెడ్వాటర్లెక్కలు తీయాలని వాటర్‌బోర్డు నిర్ణయించింది. దీనికి కసరత్తు జరుగుతోందని, త్వరలోనే కొన్ని డివిజన్లలో పైలట్‌ప్రాజెక్ట్‌గా డిస్ట్రిక్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్తున్నారు.
డిస్ట్రిక్ట్ మీటర్లు అంటే..?
వాటర్‌బోర్డుకు నష్టం వస్తున్న అన్ అకౌంటెడ్ వాటర్‌ను లెక్కించడానికి అధికారులు డిస్ట్రిక్ట్ మీటర్ల ఏర్పాటుపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం దీని డీపీఆర్ సిద్ధమవుతోంది. కనెక్షన్‌దారుల నుంచి బిల్లులు వసూలు చేసేందుకు బోర్డు డాకెట్లు(ఈ–పాస్) ద్వారా బిల్లుల పంపిణీ చేస్తుంటారు. ఒక్కో డాకెట్‌లో 600 నుంచి 1200 మంది కనెక్షన్‌దారులు ఉంటారు. అంటే ఒక కాలనీ లేదా బస్తీలను యూనిట్‌గా తీసుకుని బిల్లులు ఇస్తుంటారు.
ఇప్పుడు బోర్డు పరిధిలో 2వేలకు పైగానే డాకెట్లు ఉన్నాయి. ఈ లెక్క ప్రకారం కొత్తగా ఏర్పాటు చేయాలనుకుంటున్న డిస్ట్రిక్ట్మీటర్లను కొన్ని కాలనీలు, బస్తీల్లో సరఫరా జరిగే పైప్‌లైన్‌కు అమరుస్తారు. దీంతో ఆ లైన్‌ద్వారా ఆ ప్రాంతానికి ఎంత నీరు సరఫరా అయ్యిందన్నది తెలుస్తుంది.
ఉదాహరణకు ఒక ప్రాంతంలో 10వేల కిలోలీటర్ల నీటి సరఫరా జరిగితే ఆ పదివేలకు తగ్గట్టుగా అంటే ఓ 10శాతం ట్రాన్స్మిషన్లాస్ జరిగినా 9వేల కి.లీ. నీటికి బిల్లులు వసూలు అవుతున్నాయా? లేదా? అన్నది తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఒక వేళ తక్కువ బిల్లులు వసూలవుతున్నట్టయితే ఆ ప్రాంతాల్లో వినియోగదారులు నీటి బిల్లులు చెల్లించకపోవడమో..లేక అక్రమ నీటి వినియోగం జరుగుతుందనో గ్రహిస్తారు.
అలాగే ఏ ఏ ఏరియాల్లో ఎక్కువ నీటి వినియోగం జరుగుతోందన్నది కూడా తెలుస్తుంది. అక్రమ కనెక్షన్లను కూడా గుర్తించడానికి వీలుంటుంది. ఈ విధానాన్ని పైలట్‌ప్రాజెక్ట్‌గా కొన్ని డివిజన్లలో అమలు చేసి సక్సెస్అయితే, దశల వారీగా నగరమంతా అమలు చేస్తామని అధికారులు చెబుతున్నారు.