
- ఎస్సారెస్పీ స్టేజ్ 1 కింద 2.34 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటి విడుదల
- స్కివమ్ రెండో మీటింగ్‌లో ఇరిగేషన్ శాఖ నిర్ణయం
- భారీ ప్రాజెక్టుల కింద 3.29 లక్షలు.. మధ్యతరహా ప్రాజెక్టుల కింద 1.41లక్షల ఎకరాలకు నీళ్లు
హైదరాబాద్, వెలుగు : ఖరీఫ్ సీజన్‌లో గోదావరి కింద 4,71,737 ఎకరాలకు నీళ్లివ్వాలని రాష్ట్ర స్థాయి సాగునీటి విడుదల ప్రణాళిక కమిటీ (స్కివమ్) నిర్ణయించింది. ప్రస్తుతం గోదావరి బేసిన్‌లోని నీటి లభ్యత ఆధారంగా పంటలకు నీటిని విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. బుధవారం జలసౌధలో ఈఎన్‌సీ జనరల్ అంజద్ హుస్సేన్ నేతృత్వంలో స్కివమ్ కమిటీ రెండో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రిజర్వాయర్లలోని నీటి లభ్యత ఆధారంగా సాగు, తాగునీటి అవసరాలపై చర్చించారు.
వరి, ఆరుతడి పంటలకు నీళ్లు
భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల్లో 50.34 టీఎంసీల నీటి నిల్వ ఉందని లెక్క తీసిన అధికారులు.. 3,93,430 ఎకరాల్లో వరి పంటకు, 78,307 ఎకరాల్లో ఆరుతడి పంటలకు నీళ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా మేజర్ ప్రాజెక్టుల కింద 3,29,847 ఎకరాలు, మీడియం ప్రాజెక్ట్‌ల కింద 1,41,890 ఎకరాలకు నీళ్లివ్వనున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ స్టేజ్1 కింద 2,34,639 ఎకరాలకు నీటిని విడుదల చేయనున్నారు. అయితే, లోయర్‌మానేరుకు ఎగువన సరస్వతి, కాకతీయ కెనాల్స్ ద్వారా ఆయకట్టుకు నీటిని అందించనున్నారు.
ఇందుకు 25.30 టీఎంసీల జలాలు అవసరమవుతాయని తేల్చారు. అలీసాగర్ లిఫ్ట్ కింద 49,803 ఎకరాలు, గుత్ప లిఫ్ట్ కింద 35,405 ఎకరాలు, శ్రీపాద ఎల్లంపల్లి మంథని లిఫ్ట్ కింద 10 వేల ఎకరాలకు నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. కాగా, ఇప్పటికే కృష్ణా బేసిన్‌లో 10,30,082 ఎకరాల్లో వరి, 7,38,158 ఎకరాల్లో ఆరుతడి పంటలకు నీళ్లివ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. మొత్తంగా కృష్ణా బేసిన్‌లో 17.68 లక్షల ఎకరాలు, గోదావరిలో 4.71 లక్షల ఎకరాలకు వర్షాకాలంలో నీళ్లను అందించనున్నారు. గోదావరిలో వరదను బట్టి మరోసారి స్కివమ్ మీటింగ్‌ను నిర్వహించి నీటి లభ్యతపై అధికారులు చర్చించాలని నిర్ణయించారు.