కాళేశ్వరం ఆగింది.. ఎస్సారెస్పీ సాగింది

కాళేశ్వరం ఆగింది.. ఎస్సారెస్పీ సాగింది
  • సూర్యాపేట జిల్లాలోని కోదాడ దాకా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీళ్లు  
  • ఎస్సారెస్పీ స్టేజ్ 2కు మిడ్ మానేరు, ఎల్ఎండీ నుంచి నీటి విడుదల 
  • ఇన్నాళ్లు ఏ జిల్లాకు నీళ్లు వదిలినా కాళేశ్వరం జలాలే అంటూ గత ప్రభుత్వం కలరింగ్  
  • ఎస్సారెస్పీ ఆయకట్టును కాళేశ్వరం ఆయకట్టుగా చూపే ప్రయత్నం
  • అదే పనిగా ప్రచారం చేసిన గత సర్కార్ పెద్దలు, కొందరు ఇంజినీర్లు 

కరీంనగర్/సూర్యాపేట, వెలుగు : పంప్​హౌస్​లు​ మునిగి, బ్యారేజీలు కుంగి, ఏడాదిన్నర కాలంగా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలు నిలిచిపోయినా.. గోదావరి నీళ్లు ఎప్పట్లాగే సూర్యాపేట జిల్లాలోని కోదాడ వరకు పారుతున్నాయి. ఇటీవల యాసంగి సీజన్​కోసం ఎస్సారెస్పీ నుంచి విడుదల చేసిన నీళ్లు.. తాజాగా కోదాడ నియోజకవర్గంలోని మోతె, నడిగూడెం మండలాలకు చేరాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ముందు కూడా ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ, గత బీఆర్ఎస్​ పాలకులు మాత్రం ఇదంతా కాళేశ్వరం గొప్పతనంగా చెప్పుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచే  సూర్యాపేట జిల్లాకు నీళ్లందిస్తున్నామని మూడు, నాలుగేండ్ల పాటు పనిగట్టుకుని ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడదంతా వట్టిదేనని తేలిపోయింది. ఈసారి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చుక్క నీరు రాకపోయినా.. ఏటా యాసంగిలో మాదిరి ఇప్పుడు కూడా కరీంనగర్ జిల్లాతో పాటు ఉమ్మడి వరంగల్, సూర్యాపేట జిల్లాలకు శ్రీరాం సాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) జలాలు వస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ఎస్సారెస్పీ స్టేజ్ 2 ఆయకట్టు కింద ఉమ్మడి వరంగల్, సూర్యాపేట జిల్లాలు ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు 20 ఏండ్లకు ముందు నుంచే గోదావరి జలాలు అందుతుండగా.. సూర్యాపేట జిల్లాకు నీళ్లందించేందుకు దివంగత సీఎం వైఎస్ హయాంలో జనగామ జిల్లా కొడకండ్లలో బయన్నవాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించారు. నిజామాబాద్​జిల్లాలోని ఎస్సారెస్పీ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మిడ్ మానేరు నుంచి  లోయర్ మానేరు డ్యాంలోకి నీటి విడుదల నిరంతరాయంగా సాగుతోంది. ఈ క్రమంలో ఎల్​ఎండీ నుంచి ఈ నెల ఒకటిన విడుదలైన నీటితో కాకతీయ కెనాల్ ద్వారా వరంగల్ జిల్లాలోని మైలారం రిజర్వాయర్, ఆ తర్వాత బయన్నవాగు రిజర్వాయర్  నింపుతున్నారు. ఈ నెల 8 నుంచి బయ్యన్నవాగు రిజర్వాయర్ ద్వారా వారబందీ పద్ధతిలో సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, మద్దిరాల, నూతనకల్, నాగారం, అర్వపల్లి, సూర్యాపేట నియోజకవర్గంలోని ఆత్మకూరు ఎస్, చివ్వెంల, పెన్ పహాడ్, కోదాడ నియోజకవర్గంలోని మోతే, నడిగూడెం, పెన్​పహాడ్​ మండలాలకు నీళ్లను విడుదల చేస్తున్నారు. 

ఈ నెల 8 నుంచి 15 వరకు  మొదటి విడత నీళ్లను విడుదల చేశారు. మంగళవారం నుంచి ఈ నెల 30 వరకు, ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు, 22 నుంచి 29 వరకు విడతల వారీగా నీళ్లను విడుదల చేయనున్నారు. అలాగే మార్చి 8 నుంచి 15 వరకు, 23 నుంచి 30 వరకు కూడా నీటిని విడుదల చేయనున్నట్లు ఇరిగేషన్ ఆఫీసర్లు వెల్లడించారు. మొత్తంగా 48 రోజుల పాటు 16. 587 టీఎంసీలను సూర్యాపేట జిల్లాకు విడుదల చేయనున్నారు. ఈ నీళ్లతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒక్క తుంగతుర్తి నియోజకవర్గంలోనే సుమారు లక్ష ఎకరాలు సాగు కానుంది. 

మేడిగడ్డ కుంగడంతో నీళ్లే రావని ప్రచారం.. 

ఇన్నాళ్లు  ఏ జిల్లాకు నీళ్లు వదిలినా, ఏ చెరువు మత్తడి పోసినా అవన్నీ కాళేశ్వరం జలాలే అంటూ బీఆర్ఎస్​పెద్దలు కలరింగ్​ఇచ్చుకున్నారు. ఈ క్రమంలోనే కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు తర్వాత ఇక వరంగల్, సూర్యాపేట జిల్లాలకు సాగునీటి సరఫరా ఉండకపోవచ్చని స్వయంగా కొందరు బీఆర్ఎస్ నేతలు, వారికి మద్దతుగా ఉన్న ఇరిగేషన్ ఆఫీసర్లు సన్నాయి నొక్కులు నొక్కారు. కానీ ఎప్పట్లాగే ఈ యాసంగిలోనూ సూర్యాపేట జిల్లా వరకు ఎస్సారెస్పీ జలాలను విడుదల చేయడంతో ఈ ప్రచారానికి చెక్ పెట్టినట్లయింది. 

తెలంగాణకు ఎస్సారెస్పీనే పెద్ద దిక్కు.. 

రాష్ట్రంలో కాళేశ్వరమే అతి పెద్ద సాగునీటి ప్రాజెక్టు అని, ఆ నీటితో తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్నామని గత బీఆర్ఎస్​సర్కారు గొప్పలు చెప్పుకుంది. కానీ అదంతా ఉత్తదేనని గత నాలుగేండ్ల ఇరిగేషన్ లెక్కలు చెప్తున్నాయి. ఏటా సాగునీటి కేటాయింపులకు సంబంధించి రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తున్న స్కివమ్ కమిటీ మీటింగుల ద్వారా ఈ విషయం స్పష్టమవుతోంది. ఈ యాసంగిలో రాష్ట్రవ్యాప్తంగా 28.95 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని ప్రతిపాదించగా, అందులో ఒక్క ఎస్సారెస్పీ కిందే 11.55 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని నిర్ణయించడం విశేషం. కాళేశ్వరం ప్రాజెక్టు కింద కేవలం 93 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇవ్వాలని ప్రతిపాదించారు. దీన్ని బట్టి రాష్ట్ర సాగునీటి అవసరాలకు ఇప్పటికీ శ్రీరాంసాగర్ నే​పెద్ద దిక్కుగా ఉందని చెప్పుకోక తప్పదు.

ఇప్పుడు ఇస్తున్నవన్నీ ఎస్సారెస్పీ నీళ్లే.. 

ఎల్ఎండీ, మిడ్ మానేరు రిజర్వాయర్లలోని నీటిని వరంగల్, సూర్యాపేట జిల్లాలకు విడుదల చేస్తున్నాం. ఇప్పుడు విడుదల చేస్తున్న నీటిలో కాళేశ్వరం నీళ్లు లేవు. ఇప్పుడు ఇస్తున్నవన్నీ పూర్తిగా ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు సంబంధించిన నీళ్లే. ఎల్లంపల్లి నుంచి, కాళేశ్వరం నుంచి నీళ్లు రావట్లేదు. 

శంకర్, ఎస్ఈ, ఇరిగేషన్