పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదల ప్రారంభం

పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదల ప్రారంభం
  • సీజన్లో తొలిసారిగా రాయలసీమ కాలువలకు నీటి విడుదల

అమరావతి: ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటిని విడుదల ప్రారంభించింది. శ్రీశైలం డ్యాంకు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న నేపధ్యంలో రాయలసీమ కాలువల కోసం నీటి విడుదలకు ఆదివారం శ్రీకారం చుట్టింది.  నంద్యాల పార్లమెంట్ సభ్యుడు పోచా బ్రహ్మానంద రెడ్డి,  నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్,  శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి తదితరులు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల ప్రారంభించారు. ప్రస్తుతం శ్రీశైలం నీటిమట్టం 862 అడుగులకు చేరుకుంటోంది. ఇన్ ఫ్లో దాదాపు 3 లక్షల 75 వేల క్యూసెక్కులకుపైగా వరద చేరుకుంటున్న నేపధ్యంలో నీటి విడుదలకు ఢోకాలేని పరిస్థితి ఏర్పడింది. 
శ్రీశైలం డ్యామ్ లో నీటిమట్టం 854 అడుగులకు చేరుకున్న వెంటనే నీటి విడుదలను ప్రారంభించే అవకాశం ఉంది. అయితే తగినంత వరద ప్రవాహం లేని కారణంగా నీటి విడుదలకు ప్రభుత్వం సుముఖత చూపలేదు. వరద ప్రవాహం గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతుండడంతో ఎట్టకేలకు ఈ సీజన్లో తొలిసారిగా నీటి విడుదలను ప్రారంభించింది. ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహం ఆధారంగా పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదలను క్రమక్రమంగా పెంచే అవకాశం అధికారులు చెబుతున్నారు.