వేసవి సమస్యలు మొదలయ్యాయి. ఎప్పటిలాగే ఈసారి కూడా భాగ్యనగరానికి నీళ్ల కష్టాలు ఉండనున్నాయి. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో మార్చి 8వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 10వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు గోదావరి నల్లా నీళ్లు బంద్ కానున్నాయి. ఈ విషయాన్ని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) తెలిపింది. దీనివల్ల సుమారుగా 8 లక్షల నల్లాలకు నీళ్లు సప్లై ఆగిపోనుంది. జీడిమెట్ల, చింతల్, జగద్గిరి గుట్ట, షాపూర్, మల్కాజ్ గిరి, గాజుల రామారం, దమ్మాయి గూడ, సూరారం, నాగారం, కీసర, బొల్లారం, గుండ్ల పోచంపల్లి, కొంపల్లి, కంటోన్మెంట్, తుర్కపల్లి బయోటెక్ పార్క్, ఎంఈసీ, ఆలేరు, కొండపాక, కాప్రా మున్సిపాలిటీ ప్రాంతాల్లో నీళ్ల సప్లైకి ఆటంకం కలుగనుంది.
మనోహరాబాద్-కొత్తపల్లి మధ్య ప్రతిపాదించిన కొత్త రైల్వై ట్రాక్ పనులు మొదలవ్వనున్నాయి. ఈ ట్రాక్ పనులు ఈ నెలలో ప్రారంభించాలని నిర్ణయించారు. దాంతో కుకునూర్‌పల్లి వద్ద గోదావరి తాగునీటి సరఫరా పథకం-ఫేజ్-1 పైప్‌లైన్ మార్గాన్ని మార్చనున్నారు. ఈ కారణంతో సిటీ పరిసర ప్రాంతాల్లో నీటి సరఫరాకు ఆటంకం కలుగుతుందని వాటర్ సప్లై బోర్డు తెలిపింది.
