మనకంటే ముసలివాళ్లు మోతేబర్​గా ఉన్నరు.. 

మనకంటే ముసలివాళ్లు మోతేబర్​గా ఉన్నరు.. 
  • తలసరి ఆదాయంలో మనమే నంబర్​ వన్​
  • ఇదంతా కడుపు కట్టుకుని, మెదడు రంగరించి పనిచేస్తేనే సాధ్యమైంది: కేసీఆర్
  • మరే రాష్ట్రంలో లేనంత జీతాలు ఇక్కడిస్తున్నం
  • చాలా రాష్ట్రాల్లో సెక్రటేరియెట్లు మన కలెక్టరేట్ల లెక్క కూడా లేవు
  • నేను ఇచ్చే 2 వేలల్ల 500 దాస్కుంటున్నరు
  • వాళ్లను కోడండ్లు ఇంట్లకు రమ్మంటున్నరు
  • మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో సీఎం
  • ఆ జిల్లా ఎమ్మెల్యేలకు అదనంగా రూ.పది కోట్ల ఫండ్

హైదరాబాద్, వెలుగు: మనది ధనిక రాష్ట్రమేనని, అద్భుతమైన నిధులు ఉన్నాయని సీఎం కేసీఆర్​ అన్నారు. కొంత మంది మూర్ఖులు తెలివిలేక, అవగాహన లేక కారుకూతలు కూస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. అట్లాంటోళ్ల మాటలు వింటే గోసపడుతామని పేర్కొన్నారు. మన వనరులు మనకే దక్కాయని, మనం చాలా గొప్పగా, ఆర్థికంగా పటిష్టపడ్డామని చెప్పారు. ఇదంతా చాలా క్రమశిక్షణతోని, కడుపు, నోరు కట్టుకుని పని చేస్తే, మెదడు రంగరించి, హృదయంతో పనిచేస్తేనే సాధ్యమైందని, ఆషామాషీగా కాదని అన్నారు. దేశంలోని మరే రాష్ట్రంలో లేనంత జీతాలను తెలంగాణ ఉద్యోగులకు ఇస్తున్నామని, చాలా రాష్ట్రాల్లో సెక్రటేరియట్‌‌లు కూడా మన కలెక్టరేట్ల తీరుగా లేవని అన్నారు. ఒకప్పుడు మన రాష్ట్రం నుంచి లక్షల మంది వలస పోయేదని, ఇప్పుడు 12 రాష్ట్రాల నుంచి పేదలు వచ్చి మన రాష్ట్రంలో బతుకుతున్నారని ఆయన చెప్పారు. మేడ్చల్ మల్కాజ్‌‌గిరి జిల్లా ఇంటిగ్రేటెడ్‌‌ కలెక్టరేట్​ను బుధవారం కేసీఆర్ ​ప్రారంభించి మాట్లాడారు. 
ఇంటింటికీ మంచి నీరు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంవచ్చాక  24 గంటల కరెంట్ ఇస్తున్నామని, దేశంలో ఇట్లా కరెంట్​ ఇస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణనే అని చెప్పారు. ‘‘మన హైదరాబాద్​లో కరెంట్​ పోదు.. దేశ రాజధాని ఢిల్లీలో 24 గంటల కరెంట్​ రాదు. మీరు నమ్మగలుగుతరా? ఇది నేటి పరిస్థితి” అని పేర్కొన్నారు. తనకంటే దొడ్డు, పొడుగు ఉన్న ముఖ్యమంత్రులెవరూ కరెంట్, నీళ్లు ఇవ్వలేకపోయారని విమర్శించారు. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు.  ‘‘తెలంగాణ వస్తే వనరుల దోపిడీ ఆగిపోతదని, అద్భుతమైన ధనిక రాష్ట్రం అయితదని నేను ఉద్యమ సమయంలోనే చెప్పిన. 
రాష్ట్ర ఆర్థిక స్థితిని కొలిచే గీటు రాళ్లు 2, 3 ఉంటయ్​. అందులో ఒకటి తలసరి ఆదాయం. తెలంగాణ ఏర్పడినప్పుడు తలసరి ఆదాయం రూ. లక్ష ఉంటే, ఇప్పుడు ఇండియాలోనే నంబర్‌‌‌‌ వన్‌‌గా రూ. 2,78,500 అయింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి 11.5 లక్షల కోట్లకు పెరిగింది. మనకంటే దశాబ్దాల ముందు నుంచే రాష్ట్రాలుగా ఉన్న  తమిళనాడు, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలన్నింటినీ దాటేసి ముందకెళ్లినం’’ అని పేర్కొన్నారు. ‘‘మేడ్చల్ జిల్లా అయితదని ఈ ప్రాంతపోళ్లు కలలో కూడా ఊహించలేదు. తెలంగాణ ఏర్పాటు వల్లే ఇది సాధ్యమైంది. సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నయ్” అని కేసీఆర్​ చెప్పారు. 58 ఏండ్లు కష్టపడి కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంటే, ఈ 7 ఏండ్లల్ల ఇవన్నీ చేసుకోగలిగినమని తెలిపారు. 

అత్తలు, అవ్వలకు డిమాండ్​ పెరిగింది
సర్కార్ నెలా నెలా ఇచ్చే పింఛన్ డబ్బులతో ఇండ్లలో వృద్ధులకు గౌరవం దక్కుతున్నదని కేసీఆర్ అన్నారు. ‘‘ఇవాళ ఎవరి దగ్గర డబ్బులు లేవు గానీ, ముసలివాళ్ల దగ్గర మాత్రం నలభై, యాభై వేలకు తక్కువ లేకుండా డబ్బులున్నయ్​. నేను 2 వేలు పంపిస్తే 1,500 ఖర్చుపెట్టుకున్నా.. 500 దాస్కొని వాళ్లు ఎంతో కొంత డబ్బు జమజేసుకొని ఉన్నరు. మనకంటే మోతేబర్​గా ఉన్నరు ముసలివాళ్లు” అని ఆయన చెప్పారు. ‘‘పింఛన్‌‌తోని అత్తలు, అవ్వలకు డిమాండ్ పెరిగింది. వాళ్లను కోడండ్లు ఇంట్లకు రమ్మంటున్నరు, కూర్చొమ్మంటున్నరు’’ అని ఆయన అన్నారు.

చైనా, సింగపూర్‌‌‌‌ తీరుగా పురోగమించాలి
కొందరు మూర్ఖులు వచ్చి ఏవో మాటలు చెప్తున్నారని, ఆ మాటలు విని మోసపోతామని కేసీఆర్​ పేర్కొన్నారు. ‘‘ఏదైనా కూలగొట్టాలంటే 10 రోజులు చాలు. నిర్మించాలంటే చాలా రోజులు పడ్తది” అని అన్నారు. దేశాన్ని మతం పేరిట విడగొట్టే చర్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. విభజన రాజకీయాలకు దూరంగా ఉండాలని, ఐక్యంగా ఉండాలని,  చైనా, సింగపూర్‌‌‌‌, కొరియా తీరుగా కుల, మతాలకు అతీతంగా పురోగమించాలని చెప్పారు. 

మేడ్చల్‌‌ జిల్లా ఎమ్మెల్యేలకు రూ. పది కోట్లు అదనం
మేడ్చల్‌‌లో పరిస్థితి చాలా బ్రహ్మాండంగా ఉందని, ప్రజలు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యేలు తనకు చెప్పినట్లు కేసీఆర్  పేర్కొన్నారు. ‘‘కొన్ని మిస్సింగ్ పనులు ఉన్నట్లు నా దృష్టికి తీసుకొచ్చిన్రు. మేడ్చల్ జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలకు ప్రస్తుతం ఇస్తున్న రూ. 5 కోట్లకు అదనంగా, మరో రూ. 10 కోట్లు ఎమ్మెల్యే ఫండ్ కింద ఇస్తం” అని ఆయన ప్రకటించారు. ఇందుకు సంబంధించి గురువారమే జీవో ఇస్తామని సీఎం చెప్పారు.

కొత్త సెక్రటేరియెట్ పనుల నాణ్యతలో రాజీ పడొద్దని, వీలైనంత తొందరగా పూర్తి చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. సెక్రటేరియట్ లోని అన్ని విభాగాలను అద్భుతంగా, సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. సెక్రటేరియట్ నిర్మాణ పనులను బుధవారం ఆయన పరిశీలించారు. అన్నిచోట్ల కలియ తిరుగుతూ.. అనుకున్న డిజైన్ల ప్రకారం పనులు జరుగుతున్నాయా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు. 
స్లాబుల నిర్మాణం, భవనంపై డూమ్స్ ఏర్పాటు, ఇంటీరియర్, ఫర్నీచర్ విషయంలో కొత్త మోడల్స్ ఎంపిక చేసుకోవాలని సూచించారు. మంత్రుల చాంబర్లు, మీటింగ్ హాల్స్ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. భవనం మధ్య భాగంలో దాదాపు రెండెకరాల ఖాళీ స్థలంతో పాటు సెక్రటేరియట్ ప్రాంగణంలో గ్రీనరీ, ల్యాండ్ స్కేపింగ్ పనులు అద్భుతంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. విజిటర్స్ లాంజ్, రెడ్ స్టోన్, డ్రైనేజీ నిర్మాణ పనులను కేసీఆర్ పరిశీలించారు. అందరికీ సరిపడేలా పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని,  సౌలతులు కల్పించాలని సూచించారు. నిర్మాణ పనులపై కేసీఆర్ అక్కడే సమీక్ష జరిపారు.

సెక్రటేరియెట్ అద్భుతంగా కట్టండి