
నల్గొండ సిట్టింగ్ ఎమ్మెల్సీ సీటు నిలబెట్టుకోవాలె: కేసీఆర్
కష్టపడి పనిచేస్తే కడుపులో పెట్టి చూసుకుంటా
ఎమ్మెల్యేలు, నేతలతో కో ఆర్డినేట్ చేసుకునే బాధ్యత మంత్రులదే
మంత్రులతో సమావేశంలో సీఎం
హైదరాబాద్, వెలుగు: నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో మొదట్లో వ్యతిరేకత ఉందని, ఇప్పుడంత వ్యతిరేకత కనిపించడం లేదని టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. నల్గొండ సిట్టింగ్ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ జార విడుచుకోవద్దని మంత్రులకు తేల్చిచెప్పారు. ఎమ్మెల్సీ ఎలక్షన్లు, నాగార్జునసాగర్ బై ఎలక్షన్‌పై ఆదివారం ప్రగతిభవన్‌లో నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల మంత్రులతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఆయా జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో కో ఆర్డినేట్ చేసుకోవాల్సిన బాధ్యత మంత్రులదేనని స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ ఎలక్షన్లలో చేసినట్టుగా చేతులెత్తేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కష్టపడి పనిచేసే వారిని కడుపులో పెట్టుకొని చూసుకుంటానని చెప్పారు. ఎవరెవరు పనిచేయడం లేదో తనకు తెలుసని, వారందరినీ ప్రచారానికి తీసుకెళ్లాలని మంత్రులను ఆదేశించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులంతా కూడా స్థానిక క్యాడర్‌ను వెంటబెట్టుకొని ఓటర్ల వద్దకు వెళ్లాలని సూచించారు.
పర్యవసనాలు అనుభవించాల్సి వస్తది
ఎమ్మెల్సీ ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆషామాషీగా తీసుకోవద్దని, సిట్టింగ్ సీటును చేజార్చుకుంటే దాని పర్యవసానాలు అనుభవించాల్సి ఉంటుందని సీఎం కేసీఆర్ హెచ్చరించారు.
ఎన్నికల్లో పార్టీ గెలుపే ధ్యేయంగా పనిచేయాలని.. క్యాండిడేట్పై వ్యతిరేకత పేరుతోనో, మరే కారణాలతోనో ఎన్నికల్లో పనిచేయనివారికి ఇబ్బందులు తప్పవని స్పష్టం చేశారు. మంత్రులు జగదీశ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్ లు తామే క్యాండిడేట్లం అన్నట్టుగా ఎన్నికల్లో ముందుండాలని సూచించారు. ఇప్పటివరకు ప్రచారానికి దూరంగా ఉంటున్న వారిని వెంటనే రంగంలోకి దించాలని.. ఎట్లాంటి పొరపొచ్చాలు లేకుండా సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. నాగార్జునసాగర్ బైఎలక్షన్లో టీఆర్‌ఎస్ ఈజీగా గెలువబోతోందన్నారు. తాజా సర్వేలో టీఆర్‌ఎస్‌కు 40 శాతం ఓట్లు వస్తే.. కాంగ్రెస్‌కు 33 శాతం, బీజేపీకి 13 శాతం ఓట్లు వస్తున్నట్టుగా తేలిందన్నారు.