మేం హిందువులం.. సనాతన ధర్మంపై ఉదయనిధికి మాజీ కామెంటేటర్ స్ట్రాంగ్ కౌంటర్!

మేం హిందువులం.. సనాతన ధర్మంపై ఉదయనిధికి మాజీ కామెంటేటర్ స్ట్రాంగ్ కౌంటర్!

Hindu Faith: తమిళనాడు రాజకీయాల్లో 'సనాతన ధర్మం' వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ “సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి” అంటూ చేసిన వ్యాఖ్యలపై టీమిండియా మాజీ క్రికెటర్ (కామెంటేటర్, లెగ్ స్పిన్నర్) లక్ష్మణ్ శివరామకృష్ణన్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

అదే తప్పు చేస్తే.. మీరే కనుమరుగవుతారు!: 
ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా శివరామకృష్ణన్ ఘాటైన పోస్ట్ చేశారు. "పాత మోటారుకు కొన్ని పార్టీలు మార్చి, కొత్త పెయింట్ వేసి యువతను మభ్యపెట్టి అధికారంలో కూర్చున్నారు.. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్న వ్యక్తి డిప్యూటీ సీఎం పదవిని కోల్పోయాడు (ఎన్నికల ఫలితాలను ఉద్దేశించి).. దయచేసి మళ్లీ అదే తప్పు చేయకండి, అలా చేస్తే మీరు కూడా త్వరలో కనుమరుగవుతారంటూ సూచించారు. సనాతన ధర్మమే అత్యున్నతమైనదని మేం నమ్ముతామంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

ఓపిక నశిస్తే.. తీవ్ర పరిణామాలే: 
మాజీ కామెంటేటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ మరొక పోస్ట్‌లో మాకు శాంతియుతంగా, ఎంతో ఓపికగా ఉండాలని నేర్పిస్తారు.. ఆ ఓపిక అనేది సాగే రబ్బరు బ్యాండ్ లాంటిది.. ఒక హద్దు వరకే సాగుతుంది, కానీ మితిమీరి లాగితే అది తెగిపోయి గందరగోళ పరిస్థితులకు దారి తీస్తుంది అన్నారు. ఎవరి నమ్మకాలతో వాళ్లు ప్రశాంతంగా కలిసి జీవించవచ్చు అని పేర్కొన్నారు.

కలిసికట్టుగా ఉందాం.. జై శ్రీరామ్: 
తన పోస్ట్‌ల తర్వాత హిందువులను ఎగతాళి చేస్తూ తనకు రిప్లైలు వస్తున్నాయని మాజీ కామెంటేటర్ శివరామకృష్ణన్ ఆవేదన వ్యక్తం చేశారు. మన ధర్మాన్ని కాపాడుకోవడానికి మనమంతా ఏకతాటిపైకి రావాలి అని పిలుపునిచ్చారు. ఒకే ఒక వెదురు బొంగును సులభంగా విరిచేయొచ్చు.. అదే ఓ పెద్ద కట్టగా ఉంటే విరగ్గొట్టడం ఎవరి తరం కాదు.. భగవంతుడు మన వైపే ఉన్నాడు.. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై అంటూ సనాతన ధర్మ అనుచరులంతా ఐక్యంగా ఉండాలని కోరాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. భావప్రకటనా స్వేచ్ఛ, సనాతన ధర్మం చుట్టూ జరుగుతున్న ఈ జాతీయ స్థాయి పొలిటికల్ డిబేట్‌లో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.