అన్నలం కాదు.. అధికార పార్టోళ్లం!..పోలీసులపై ఎమ్మెల్సీ సారయ్య ఫైర్

అన్నలం కాదు.. అధికార పార్టోళ్లం!..పోలీసులపై ఎమ్మెల్సీ సారయ్య ఫైర్

వరంగల్​సిటీ, వెలుగు: ‘ మేం అన్నలం కాదు.. అధికార కాంగ్రెస్​పార్టీ వాళ్లం’ అని  ఎమ్మెల్సీ సారయ్య పోలీసులపై మండిపడ్డారు. సోమవారం బల్దియా కౌన్సిల్​మీటింగ్ కు ఆయన కారుతో వస్తుండగా గేటు వేసి ఉంది. గేటు తీయాలని చెప్పినా సకాలంలో ఎవరూ స్పందించలేదు. కొద్దిసేపటి తర్వాత గేటు తీయగా... ఎమ్మెల్సీ వెంట వచ్చినవారిని ఎవరని మట్టెవాడ సీఐ కరుణాకర్​ప్రశ్నించారు. 

దీంతో అగ్రహం చెందిన సారయ్య పోలీసుల తీరుపై ఫైర్ అయ్యారు. ఇక్కడేం పని ఉందని, గేటు బయట ఉండాలని పోలీసులకు సూచించారు. కాగా..  ప్రజాప్రతినిధుల ఫండ్స్​తో నిర్మించిన ప్రభుత్వ నిర్మాణాలు, కుల సంఘం భవనాలు, సొసైటీ భవనాలను బల్దియా ఆక్రమించుకుంటుందని చర్చ నడుస్తుండగా సారయ్య  ఆగ్రహం వ్యక్తం చేశారు.  

చేతిలోని పేపర్లను చించి విసిరేశాడు. గతంలో ఇలాంటి నిర్మాణాలు వందల్లో కట్టినట్లు,  ఇప్పుడు వాటిని ఆక్రమించుకుంటే ఎలా కుదురుతుందని ఎదురుదాడికి దిగడంతో గందరగోళం నెలకొంది. మీటింగ్ అనంతరం సారయ్య మీడియాతో మాట్లాడటానికి ప్రయత్నించగా వెస్ట్ ఎమ్మెల్యే రాజేందర్​రెడ్డి అడ్డుకుని, కారులో ఎక్కించి పంపించారు. 

మేయర్​సుధారాణి మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు.  వరంగల్​ తూర్పు ప్రాంతానికి  సరిగా నిధులు కేటాయించలేదనే ఆరోపణతోనే ఎమ్మెల్సీ సారయ్య ఆగ్రహం చెందినట్టు తెలిసింది.