వార్డు పాలనొచ్చినా.. మార్పు కనిపిస్తలే!

వార్డు పాలనొచ్చినా..  మార్పు కనిపిస్తలే!

ఎప్పటిలెక్కనే  ఫిర్యాదులు పెండింగ్

“ ప్రజల వద్దకు పాలన చేరాలనే లక్ష్యంతో  వార్డు ఆఫీసులను ఏర్పాటు చేస్తున్నాం. ఇకపై జీహెచ్‌‌ఎంసీలో పాలన మరింత సులభతరంగా మారుతుంది. 2014 నుంచి ఇప్పటిదాకా హైదరాబాద్‌‌ నగరం గణనీయమైన మార్పులు సాధించింది. ఇందుకు ప్రజల సహకారం ఉంటే హైదరాబాద్‌‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోవడం సాధ్యమవుతుంది.  ప్రపంచంలో అద్భుతమైన టోక్యో నగరంలా హైదరాబాద్‌‌ మారాలి.’’ - జూన్ 16న కాచిగూడలో వార్డు ఆఫీసు ఓపెనింగ్ సందర్భంగా కేటీఆర్‌‌ చెప్పిన మాటలివి. 

  •     విజిటింగ్ అవర్స్ లోనే ఉంటామంటున్న అధికారులు  
  •     చాలా చోట్ల పూర్తిగా కొనసాగని వార్డు పాలన
  •     20 రోజులు దాటినా ప్రజలకు అవగాహన లేదు 

హైదరాబాద్, వెలుగు : బల్దియాలో ప్రజల సమస్యల  తక్షణ పరిష్కారానికి వార్డు పాలనను అందుబాటులోకి తెచ్చారు. ఎలాంటి మార్పు కనిపించడంలేదు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను పట్టించుకోవడంలేదు.  గ్రేటర్​లో జూన్ 16న వార్డు పాలన వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. 50 వేల జనాభాకు ఒక వార్డును ఏర్పాటు చేశారు. ఇందులో వివిధ  విభాగాల నుంచి  10 మంది  అధికారుల టీమ్​ ఉంటుంది. వార్డు పరిధిలోని ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను  సత్వరమే పరిష్కరించాల్సి ఉంటుంది. ప్రాబ్లమ్ సాల్వ్ చేశాక ఫిర్యాదు దారుడికి మళ్లీ సమాచారం అందించడమే వార్డు పాలన లక్ష్యం. సిటీలో మొత్తం150 వార్డులుండగా  ఓల్డ్ సిటీలో చాలా వరకు ఆఫీసులు అందుబాటులోకి  రాలేదు. 20 రోజులు దాటినా  కొన్నివార్డుల్లో 20 ఫిర్యాదులు కూడా అందలేదు. కొన్నిచోట్ల ఫిర్యాదులు పెండింగ్​లో ఉంటుండగా.. మరికొన్ని వార్డుల్లో పనులు చేయకుండానే ఫిర్యాదులను క్లోజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వీటిని అట్టహాసంగా ప్రారంభించినా, సేవలపై ప్రచారం చేయడంతో మాత్రం బల్దియా విఫలమైంది. 

అందుబాటులో ఉండట్లే..

వార్డుస్థాయిలో తాగునీటి , సీవరేజ్, శానిటేషన్, టౌన్ ప్లానింగ్ తదితర సమస్యలపై వచ్చే ఫిర్యాదులపై సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సిటిజన్ చార్ట్ ఆధారంగా నిర్ణీత సమయంలో పరిష్కారం చూపాలి. ఒక్కో వార్డు ఆఫీస్​లో  అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఇంజనీర్, టౌన్ ప్లానర్, ఎంటమాలజిస్ట్, శానిటరీ జవాన్,  అర్బన్ బయోడైవర్సిటీ సూపర్ వైజర్, వాటర్ బోర్డు అసిస్టెంట్, లైన్​మన్ లేదా లైన్ ఇన్​స్పెక్టర్, కంప్యూటర్ ఆపరేటర్​తో పాటు రిసెప్షనిస్ట్  ఉండాలి. ప్రతిరోజు ఉదయం తమ పరిధిలోని వార్డులో పర్యటించాలి.

 ప్రజల సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించాలి. మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు వార్డు ఆఫీసులో స్థానికులకు అందుబాటులో ఉండాలి. ఉదయం వచ్చిన  ఫిర్యాదులను డేటా ఎంట్రీ చేసి సంబంధిత అధికారికి ఫార్వర్డ్ చేయాలి. సమస్య పరిష్కారమైన తర్వాత ఫిర్యాదుదారుడికి సమాచారం అందించాలి. అయితే.. కొందరు అధికారులు విజిటింగ్ సమయాల్లో కూడా అందుబాటులో ఉండడం లేదు. ఎందుకు రాలేదని అడిగితే సర్కిల్ ఆఫీసులకి వెళ్లారని సమాధానం ఇస్తున్నారు.  

సిటిజన్ చార్ట్​ ఫాలో కావట్లే..

పలు సమస్యలపై వచ్చే ఫిర్యాదులను ఎప్పటిలోగా పరిష్కరించాలనే దానిపై వార్డు ఆఫీసుల్లో సిటిజన్ చార్ట్ కూడా ఏర్పాటు చేశారు. అందులో చెత్త తరలింపు ఫిర్యాదులను అదేరోజు పరిష్కరించాలి. పాట్ హోల్స్​ పూడ్చేందుకు,  మ్యాన్ హోల్స్ మూతల ఏర్పాటు, రోడ్డు పక్కన సిల్ట్ తీసేందుకు, స్ట్రీట్​ లైట్ రిపేర్, యాంటీ లార్వా ఆపరేషన్, జంతువులు మరణించాయని వచ్చే ఫిర్యాదులపై 24 గంటల్లో పనులు పూర్తి చేయాల్సి ఉంది. డ్రైనేజీలు బ్లాక్, సీఅండ్ డీ(భవన నిర్మాణ వ్యర్థాలు) క్లీనింగ్ కోసమైతే 48 గంటలు, ఫాగింగ్ ఆపరేషనైతే 24 గంటల నుంచి 48 గంటల్లో చేపట్టాలి. ఫుట్​పాత్ రిపేర్లకు 72 గంటలు, పెట్ డాగ్ లైసెన్స్​కు వారం, సీనియర్  సిటిజన్, దివ్యాంగుల ఐడీ కార్డులను 15 రోజుల్లో ఇవ్వాల్సి ఉంది. పబ్లిక్ టాయిలెట్ల మెయింటెనెన్స్​ అయితే  నెలరోజులు, క్లీనింగ్ అయితే అదే రోజు క్లియర్ చేయాల్సి ఉంది.  కానీ కొన్ని తప్ప  మిగతావి జరగడం లేదు.  

స్ట్రీట్ లైట్ల ఫిర్యాదులపై స్పందన లేదు

సిటీలో స్ట్రీట్ లైట్ల సమస్యపై రోజుకు 800 నుంచి 1,800 వరకు జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు వస్తున్నాయి.  కొత్తగా ఏర్పాటైన వార్డు ఆఫీసుల్లోనూ ఎక్కువగానే కంప్లయింట్ చేస్తున్నారు. గ్రేటర్​లో ఎల్ఈడీ లైట్ల నిర్వహణ ఈఈఎస్ఎల్ నిర్వహిస్తుంది.  అగ్రిమెంట్​లోని లైట్ల స్టాక్​కి  ఈఈఎస్ఎల్ మెయింటెన్ చేయడం లేదు. లైట్ల బఫర్ 
స్టాక్​ను ఐదు శాతం మెయింటెన్ చేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. లైట్లు వెలగకపోయినా నెలకు రూ.8 కోట్లు బిల్లులు చెల్లిస్తున్నారు. లైట్లను మార్చేందుకు కనీసం లాడర్లను కూడా ఏర్పాటు చేయలేని దుస్థితి ఉంది.