తెలంగాణ ధాన్యంతో నాలుగు రాష్ట్రాలకు అన్నం పెడుతున్నాం : హరీశ్​రావు

తెలంగాణ ధాన్యంతో నాలుగు రాష్ట్రాలకు అన్నం పెడుతున్నాం : హరీశ్​రావు

సిద్దిపేట రూరల్, వెలుగు: తెలంగాణలో పండిన ధాన్యంతో నాలుగు రాష్ట్రాలకు అన్నం పెడుతున్నామని మంత్రి హరీశ్​రావు చెప్పారు. రాష్ట్రం రాకముందు ఇక్కడి ప్రజలు జొన్న గట్క, మక్క గట్క తప్ప ఏమీ తినలేదని, తానే అన్నం తినడం నేర్పానని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఆదివారం సిద్దిపేట రూరల్ మండలం రావురూకుల గ్రామంలో మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తో కలిసి కొత్త గ్రామ పంచాయతీ భవనం, గ్రామ ఫంక్షన్​హాల్​ప్రారంభించారు. ఇంద్రగూడెం నుంచి దుబ్బాక నియోజకవర్గం అప్పన్నపల్లి వరకు బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా హరీశ్​రావు మాట్లాడుతూ ఈ యాసంగిలో రాష్ట్రంలో 54 లక్షల ఎకరాలలో వరి సాగు చేస్తే, ఏపీలో కేవలం 16 లక్షల ఎకరాల్లో సాగు చేశారని చెప్పారు. యాసంగిలో కేంద్రం వడ్లు కొన్నా, కొనకపోయినా సీఎం కేసీఆర్ ప్రభుత్వం వడ్లు కొంటుందని, రైతులు ఆందోళన చెందొద్దని అన్నారు. బుస్సాపూర్ గ్రామంలో మంత్రి మాట్లాడుతూ మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా రెండేళ్లుగా పెండింగులో ఉన్న వడ్డీ లేని రుణాలు బ్యాంకుల్లో జమ చేస్తామని మహిళా సంఘాలకు చెప్పారు.