వానాకాలం బియ్యం ఎక్కువ కొంటం

వానాకాలం బియ్యం ఎక్కువ కొంటం
  • ఎంత తీసుకునేది ఈనెల 26న చెప్తం: పీయూష్ గోయల్​
  • కిందటేడాది బాయిల్డ్ రైస్ 5లక్షల టన్నులు తీసుకుంటం
  • రెండు సీజన్లలో రా రైస్ ఎంతిస్తరో చెప్పాలన్న కేంద్ర మంత్రి
  • ఏడాది టార్గెట్ ఒకేసారి ఫిక్స్ చేయాలన్న రాష్ట్ర మంత్రులు
  • కొనుగోళ్లపై కేంద్రం పూర్తి క్లారిటీ ఇవ్వలేదన్న రాష్ట్ర సర్కారు

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ నుంచి బియ్యం సేకరణ కోటాను పెంచుతామని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర మంత్రులకు హామీ ఇచ్చింది. ఇదివరకే కుదిరిన అగ్రిమెంట్ ప్రకారం ఈ వానాకాలం సీజన్​కు కేంద్రం 40 లక్షల టన్నుల బియ్యం తీసుకుంటున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర సర్కార్ వినతి మేరకు ఈ కోటాను పెంచుతామని చెప్పింది. అయితే ఎంత ఎక్కువ తీసుకుంటామనే దానిపై ఈనెల 26న క్లారిటీ ఇస్తామని కేంద్రం తెలిపింది. అలాగే వానాకాలం, యాసంగి రెండు సీజన్లలో కలిపి రాష్ట్ర సర్కార్ ఎంత రా రైస్ ఎఫ్ సీఐకి అందివ్వగలదో చెప్పాలని సూచించింది. మంగళవారం ఢిల్లీలోని కృషి భవన్ లో మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, టీఆర్​ఎస్​ ఎంపీలు, సీఎస్ సోమేశ్ కుమార్ ఇతర ఉన్నతాధికారులు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్​ను కలిశారు. సాయంత్రం 6:43 గంటల నుంచి రాత్రి 7:50 గంటల వరకు ఈ భేటీ సాగింది. 
కేంద్ర మంత్రితో భేటిలో రాష్ట్ర మంత్రులు బృందం మూడు రిక్వెస్టులు చేసినట్లు తెలిసింది. కిందటేడుకు సంబంధించి బ్యాలెన్స్ గా ఉన్న 5.25 లక్షల టన్నుల పారా బాయిల్డ్ రైస్ (యాసంగి పంట)ను కొనుగోలు చేయాలని కోరారు.

క్లైమెట్ కండిషన్స్, భారీ ఉష్ణోగ్రతల కారణంగా ఈ బాయిల్డ్ రైస్ పాడయ్యే పరిస్థితి ఉందని వివరించారు. అలాగే ఈ వానాకాలంలో అగ్రిమెంటు ప్రకారం 40 లక్షల టన్నుల బియ్యం బదులుగా.. మొత్తం ధాన్యంలో 90 శాతం బియ్యాన్ని సేకరించాలని కోరింది. ఇది దాదాపు  కోటీ 50 లక్షల టన్నుల ధాన్యానికి సమానం. అలాగే ఈ వానాకాలానికి సంబంధించి రాష్ట్రంలో 2.374 మిలియన్ హెక్టార్లలో, 7.543 మిలియన్ టన్నుల బియ్యం వస్తాయని కేంద్ర వ్యవసాయ శాఖకు సంబంధించిన ఎంఎన్ సీఎఫ్ సీ రికార్డులు చెబుతున్నాయని తెలిపారు. కానీ రాష్ట్ర ప్రభుత్వ అంచనాల్లో 2.513 మిలియన్ హెక్టార్లలో 10.878 మిలియన్ టన్నుల ధాన్యం రానున్నట్లు తేలిందని వివరించారు. ఈ నేపథ్యంలో వానాకాలం, యాసంగి రెండు సీజన్లకు కలిపి రాష్ట్రం నుంచి కేంద్రం ఎంత ధాన్యం కొనుగోలు చేస్తుందో చెప్పాలని అడిగారు. ఇందులో బాయిల్డ్ రైస్ ఎంత, రా రైస్ ఎంతన్నది క్లారిటీ ఇవ్వాలని కోరారు. వానాకాలానికి సంబంధించి సెప్టెంబర్ లో, యాసంగికి సంబంధించి ఫిబ్రవరి లో కేంద్రం సేకరణ టార్గెట్స్ ను నిర్దేశించడం వల్ల ఇబ్బందులు కలుగుతున్నట్లు చెప్పారు. అందువల్ల, ఏడాదికి గాను ఒకేసారి టార్గెట్ ఫిక్స్ చేస్తే, యాసంగిలో పంట మార్పు దిశగా రైతుల్లో చైతన్యం కల్పిస్తామని తెలిపారు.
ఈ సీజన్​లో కోటి 50 లక్షల ధాన్యం తీసుకోండి
రాష్ట్ర మంత్రుల బృందం వినుతులపై కేంద్ర మంత్రి గోయల్​ సానుకూలంగా స్పందించారు. ఈ సీజన్​లో బియ్యం సేకరణ కోటా పెంపుపై ఈ నెల 26 క్లారిటీ ఇస్తామని చెప్పినట్లు తెలిసింది. కిందటేడాదికి సంబంధించి బ్యాలెన్స్ గా ఉన్న 5.25 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ ను తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. కానీ ఇప్పటికే చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం వచ్చే యాసంగి పంట(బాయిల్డ్ రైస్) మాత్రం కొనుగోలు చేయబోమని చెప్పినట్లు సమాచారం. అలాగే ఏడాదిలో రెండు సీజన్లకు కలిపి టార్గెట్ ను ఒకే సారి ఫిక్స్ చేసే అంశంపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో చర్చించి వెల్లడిస్తామన్నట్లు సమాచారం.
60 లక్షల  టన్నుల బియ్యం సేకరణ
వానాకాలానికి సంబంధించి 40 లక్షల టన్నుల బియ్యం కోటాను పెంచేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. దాదాపు 60 నుంచి 70 లక్షల టన్నులు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ తో చర్చిస్తామని మంత్రుల బృందం కేంద్ర మంత్రికి తెలిపింది. తర్వాత మంత్రులు తుగ్లక్ రోడ్ లోని సీఎం అధికారిక నివాసంలో కేసీఆర్ నుంచి కలిసి వివరించారు. అయితే దీనికి సంబంధించి ఏ నిర్ణయాలు తీసుకున్నది మీడియాకు వెల్లడించలేదు. ఈ నెల 26 న జరిగే సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి హాజరు కానున్న వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడించే చాన్స్ ఉంది. అంతకుముందు కృషి భవన్ లో కేంద్ర మంత్రి పియూష్ గోయల్, రాష్ట్ర మంత్రుల బృందంతో కలిసి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ను కలిసి ధాన్యం కొనుగోళ్లు, ఇతర అంశాలపై మాట్లాడారు.

ఎక్కువ ధాన్యం కొంటామన్న కేంద్రం
హైదరాబాద్, వెలుగు: ముందుగా చేసుకున్న అగ్రిమెంట్​కంటే తెలంగాణ నుంచి ఎక్కువ ధాన్యం కొంటామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు రాష్ట్ర సర్కార్ తెలిపింది. అయితే ఎంత ఎక్కువ తీసుకుంటారనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదని.. దీనిపై ఈనెల 26న నిర్ణయం ప్రకటిస్తామని చెప్పినట్లు వివరించింది. అలాగే వచ్చే యాసంగి నుంచి పారా బాయిల్డ్ రైస్ కొనబోమని మరోసారి తేల్చిచెప్పిందని వెల్లడించింది. వానాకాలం వడ్ల కొనుగోళ్లు, యాసంగి వరి సాగు విషయంలో క్లారిటీ ఇవ్వాలని మంత్రి కేటీఆర్ ఆధర్యంలో రాష్ట్ర మంత్రులు, టీఆర్​ఎస్ ఏంపీలు, ఉన్నతాధికారుల బృందం మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రులు పీయూష్​ గోయల్, నరేంద్ర సింగ్ తోమర్ తో విడివిడిగా సమావేశమై చర్చలు జరిపింది. ఈ మీటింగ్​లో ధాన్యం కొనుగోలు పరిమితిని మరింతగా పెంచుతామని కేంద్రం హామీ ఇచ్చినట్లు రాష్ట్ర సర్కార్ తెలిపింది.

ఈనెల 26వ తేదీన(ఎల్లుండి) రాష్ట్ర మంత్రి నిరంజన్​రెడ్డితో జరిగే మీటింగ్​లో దీనిపై కేంద్రం నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు పేర్కొంది.  వానాకాలం, యాసంగి సీజన్ల వారీగా కాకుండా ఏడాది మొత్తానికి ధాన్యం సేకరణ టార్గెట్ ను ముందస్తుగానే ప్రకటించాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపింది. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించిన కేంద్రం.. కేబినెట్​లో చర్చించి ఇక నుంచి ఒకేసారి ఏడాది మొత్తం ధాన్యం కొనుగోలు టార్గెట్ ఫిక్స్ చేస్తామని హామీ ఇచ్చినట్లు వివరించింది. 

https://www.youtube.com/watch?v=UHGlk51rYYE