యాసంగి వడ్లు కొనం

యాసంగి వడ్లు కొనం
  • కేంద్రానికి తేల్చిచెప్పిన రాష్ట్ర సర్కార్
  • ఈ సీజన్​లో తమ దగ్గర రా రైస్ పండవని వెల్లడి
  • వారం రోజుల్లో మళ్లీ రివ్యూ చేస్తామన్న కేంద్రం

హైదరాబాద్‌‌, వెలుగు: యాసంగి వడ్లను కొనుగోలు చేయబోమని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి తేల్చిచెప్పింది. రాష్ట్రంలో యాసంగి సీజన్లో రా రైస్​ పండదని.. బాయిల్డ్‌‌ రైస్‌‌ మాత్రమే ఉత్పత్తి అవుతుందని తెలిపింది. దీంతో యాసంగి వడ్ల సేకరణపై మరోసారి రివ్యూ చేయాలని కేంద్రం నిర్ణయించింది. యాసంగి వడ్ల కొనుగోలుపై శుక్రవారం కేంద్ర సివిల్‌‌ సప్లయ్స్‌‌ శాఖ రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించింది. ఇందులో రాష్ట్ర సివిల్‌‌ సప్లయ్స్‌‌ కమిషనర్ అనిల్ కుమార్, ఎఫ్‌‌ సీఐ రీజినల్ మేనేజర్ దీపక్ శర్మ, జనరల్ మేనేజర్ రాజిరెడ్డి, వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. 

పోషకాలు కలిపిన బియ్యమైనా ఇవ్వండి
యాసంగి వడ్ల సేకరణపై ఇతర రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు అందాయని.. తెలంగాణ ప్రభుత్వం కూడా తమ ప్రణాళిక ఇవ్వాలని కేంద్రం రాష్ట్ర అధికారులను అడిగింది. దీనిపై రాష్ట్ర సివిల్ సప్లయ్స్‌‌ కమిషనర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ యాసంగిలో బాయిల్డ్ రైస్ మాత్రమే వస్తుందని.. రా రైస్ రాదని, రాష్ట్రంలో వడ్ల కొనుగోళ్లు చేపట్టలేమని చెప్పారు. ఒకవేళ బాయిల్డ్ రైసే ఇవ్వాల్సి వస్తే.. పోర్టిఫైడ్ రైస్ (పోషకాలు కలిపిన బియ్యం) ఇస్తే తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. యాసంగి సీజన్లో రాష్ట్రంలో అసలు వడ్ల కొనుగోళ్లే చేపట్టబోమని.. కనుక పోర్టీఫైడ్ రైస్ కూడా ఇచ్చేది లేదని అనిల్​కుమార్​ చెప్పారు. యాసంగిలో 83 లక్షల టన్నుల వడ్లు పండుతాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ రిపోర్ట్ ఇచ్చింది. 
వాటి సేకరణ కోసం రాష్ట్ర సివిల్​సప్లైస్ శాఖ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రణాళిక రూపొందించలేదు. ఈ నేపథ్యంలో ఈ సీజన్​లో వడ్లు ఎక్కువగా పండే తెలంగాణ, ఏపీ, ఒడిశా, చత్తీస్ గఢ్ రాష్ట్రాలతో వడ్ల సేకరణపై వారం రోజుల్లో మళ్లీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని కేంద్రం తెలిపింది.

ఏ రాష్ట్రం నుంచి ఎంత సేకరణ
ఈ సీజన్​లో కేంద్రం రాష్ట్రాల నుంచి 42.92 లక్షల టన్నుల బియ్యం సేకరించనున్నట్లు అంచనా రిపోర్ట్ తెలిపింది. ఏపీ నుంచి 25 లక్షల టన్నులు, ఒడిశా నుంచి 10 లక్షల టన్నులు, పశ్చిమ బెంగాల్ నుంచి మూడు లక్షల టన్నులు, కేరళ నుంచి 2.55 లక్షల టన్నులు, అసోం నుంచి రెండు లక్షల టన్నులు, త్రిపుర నుంచి 25 వేల టన్నులు, కర్నాటక నుంచి 12 వేల టన్నులు సేకరించేందుకు అంచనాలు తయారు చేసింది. తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి కొనుగోళ్లపై ఇంకా తేల్చలేదని, త్వరలో నిర్ణయించనున్నట్లు వెల్లడించింది. వడ్లతో పాటు 11 రాష్ట్రాల నుంచి 4.44 కోట్ల టన్నుల గోధుమలు కూడా సేకరించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.