- తగినంత క్యాపిటల్ ఉంది
- కావాలంటే మార్కెట్ల నుంచి సేకరిస్తాం
- స్టేట్ బ్యాంక్ ప్రకటన
కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి క్యాపిటల్ ఫండింగ్ అవసరం లేదని దేశంలో అతిపెద్ద బ్యాంక్ ఎస్‌బీఐ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం తమ వద్ద సరిపడినంత డబ్బులు ఉన్నాయని పేర్కొంది. ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల లిక్విడిటీని పెంచేందుకు, వారి లెండింగ్ కెపాసిటీని రూ.5 లక్షల కోట్లకు చేర్చేందుకు.. ప్రభుత్వ బ్యాంక్‌లకు వెనువెంటనే రూ.70 వేల కోట్లు అందించనున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘ఎస్‌బీఐ ప్రస్తుతం ఎలాంటి రీక్యాపిటలైజేషన్ కోసం చూడటం లేదు. మా వద్ద సరిపడినంత క్యాపిటల్ ఉంది. కావాలంటే మార్కెట్ల నుంచి సేకరించుకోగలం’ అని ఇండస్ట్రీ లాబీ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన ఈవెంట్లో మేనేజింగ్ డైరెక్టర్ అరిజిత్ బసు చెప్పారు. మార్కెట్ నుంచి సేకరించుకోలేని బ్యాంక్‌లకు ఈ క్యాపిటల్ ఇన్‌ఫ్యూజన్ అవసరమని పేర్కొన్నారు.
ఐపీఓకి ఎస్‌బీఐ కార్డ్స్…
నిధులు సేకరించుకునేందుకు నాన్ కోర్ అసెట్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్లను అమ్మేందుకు ఎస్‌బీఐ చూస్తున్నట్టు కూడా బసు తెలిపారు. ఎస్‌బీఐ కార్డు క్యూ4లో ఐపీఓకి వెళ్తోందని కూడా ఈ నెల మొదట్లో బ్యాంక్ చైర్మన్ రజ్‌నీష్ కుమార్ చెప్పారు. ‘ఎస్‌బీఐ కార్డ్స్ ఐపీఓను మేము ఇప్పటికే ప్రకటించాం. మరికొన్ని సబ్సిడరీల విషయంలో కూడా మేము ఇదే ఆలోచిస్తున్నాం. ప్లాన్ ప్రకారం పనిచేస్తున్నాం. క్యాపిటల్ రాబట్టుకునేందుకు మా వద్దనున్న చర్యల్లో ఇదీ ఒకటి’ అని బసు పేర్కొన్నారు. పండుగ సీజన్ రాబోతుండటంతో, ఈ బూస్టప్ చర్యలు సరియైన సమయానికి ప్రకటించినట్టు తాను భావిస్తున్నట్టు బసు అన్నారు. ఈ నిర్ణయం బ్యాంకులకు ఎంతో మేలు చేస్తుందని వివరించారు.
