123 మార్కెట్ కమిటీలను రద్దు చేశాం: మంత్రి తుమ్మల

    123 మార్కెట్ కమిటీలను రద్దు చేశాం: మంత్రి తుమ్మల

హైదరాబాద్‌‌, వెలుగు :  రాష్ట్రంలోని 197 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు  వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. 123 మార్కెట్ కమిటీలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నిరాదరణకు గురైన వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పూర్వవైభవం తెచ్చే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. 

కొత్తగా ఏర్పాటయ్యే, ప్రతి మార్కెట్ కమిటీ కార్య వర్గంలో 18 మంది సభ్యులు ఉంటారని ( చైర్మన్, వైస్ చైర్మన్ తో  కల్పి ) 12 మంది నామినేటెడ్ సభ్యులు, ఇద్దరు అధీకృత వ్యాపారస్తులు, (లైసెన్స్డ్ ట్రేడర్స్ ) మిగిలిన నలుగురు ఎక్స్‌‌అఫిషియో సభ్యులు ఉంటారని వివరించారు. మార్కెట్ కమిటీలకు నామినేట్ అయ్యే  చైర్మన్​లలో  అన్నీ వర్గాల వారికి సముచిత ప్రాధాన్యం కల్పించనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఈ మార్కెట్ కమిటీలకు ధరల నియంత్రణ, వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతి,  ఎగుమతి వివరాలు, మార్కెట్ యార్డుల నిర్వహణ  బాధ్యత అప్పగిస్తామన్నారు.