- రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడి
న్యూఢిల్లీ: గడిచిన పదేండ్లలో దేశవ్యాప్తంగా 1,700 చదరపు కిలోమీటర్లకు పైగా అడవిని కోల్పోయామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అభివృద్ధి పనుల వల్ల అడవులు తగ్గాయని గురువారం రాజ్యసభలో తెలిపింది. అయితే, దీనికి పరిహారంగా అడవుల పెంపకం కోసం భూమిని కూడా సేకరించినట్లు వెల్లడించింది. ఈ మేరకు సభలో ఓ ప్రశ్నకు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ సమాధానమిచ్చారు.
దేశంలో మొత్తం అటవీ విస్తీర్ణం పెరిగిందని, దానిని మరింత పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, మిజోరాం, మేఘాలయలో అటవీ విస్తీర్ణం తగ్గిందని, ఏపీ, తెలంగాణ, ఒడిశా, కర్నాటక, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో అటవీ విస్తీర్ణం పెరిగిందని తెలిపారు. గత పదేండ్లలో అభివృద్ధి కార్యకలాపాల కారణంగా 1,73,396 హెక్టార్ల అటవీ ప్రాంతం కోల్పోయామన్నారు.
అయితే, దీనికి పరిహారంగా 21,761 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణాన్ని పెంచామని తెలిపారు. ప్రతి రెండేండ్లకోసారి ఈ విషయంలో ప్రభుత్వం సర్వే చేపడుతుందని చెప్పారు. అలాగే, తీర ప్రాంతాల్లో చెట్లను పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని ఆప్ సభ్యుడి ప్రశ్నకు జవాబిచ్చారు.
