
- పొరపాటు సరిదిద్దుకుంటం
వికారాబాద్, వెలుగు: అభివృద్ధి పనులలో పడి పార్టీ కార్యకర్తలను పట్టించుకోలేదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఫలితంగా బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగిందని.. హైకమాండ్ దీన్ని గుర్తించిందని చెప్పారు. ఈ పొరపాట్లను సరిదిద్దుకోవడానికి పార్టీ అధినాయకత్వం సిద్ధంగా ఉందన్నారు. శుక్రవారం వికారాబాద్‌లో జరిగిన నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీకి కార్యకర్తలు, నాయకులే పట్టుకొమ్మలన్నారు.
చేవెళ్ల ఎంపీగా పార్టీ తరఫున పోటీ చేయనున్న జి.రంజిత్ రెడ్డిని మళ్లీ గెలిపించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, నాగేందర్ గౌడ్, విజయ్ కుమార్ తదితరులు మీటింగ్‌లో పాల్గొన్నారు. అయితే ఈ సమావేశానికి మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి దంపతులు హాజరుకాలేదు. కాగా పట్నం దంపతులు ఈనెల 5న కొడంగల్ లో జరిగే అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు జిల్లా రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది.