డైట్ మెనూను రూ.56 నుంచి రూ.112కు పెంచినం

 డైట్ మెనూను రూ.56  నుంచి రూ.112కు పెంచినం

మరో నెల రోజుల్లో 30 కోట్లతో రోబో థియేటర్ రాబోతుందని మంత్రి హరీష్ రావు  అన్నారు. హైదరాబాద్ లోని ఎంఎన్ జే ఆసుపత్రిలోని గోల్డెన్ జూబ్లీ బ్లాక్ నాలుగో ఫ్లోర్ లో ఉన్న మాడ్యులర్ థియేటర్లు, దోబీ ఘాట్, కిచెన్ ప్రారంభించిన హరీష్ రావు... దేశంలో తొలిసారిగా ఆంకాంలజీ(Oncology) స్పెషల్ నర్సింగ్ కోర్స్ రాబోతుందని ప్రకటించారు. ఎంఎన్ జే ప్రభుత్వ హాస్పిటల్ లో 30 కోట్లతో.. 7 మాడ్యులర్ థియేటర్స్ ప్రారంభం అయ్యాయన్నారు. ఇక్కడ క్యాన్సర్ రోగులకు చాలా బాగా అందిస్తున్నారని... మరో నెల రోజుల్లో 350 పడకల కొత్త బిల్డింగ్ రాబోతుందని చెప్పుకొచ్చారు. రోజురోజుకూ క్యాన్సర్ రోగులు పెరుగుతున్నాయన్న మంత్రి హరీష్ రావు... ప్రస్తుతం వారి కోసం 450 పడకలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. క్యాన్సర్ రోగుల కోసం రూ.5 కోట్లతో మోడ్రన్ దోబి ఘాట్, కిచెన్ కూడా ఈ రోజు నుంచి అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. 

తెలంగాణ వచ్చిన తరువాత రూ. 750 కోట్లు క్యాన్సర్ రోగులకు ఖర్చు చేశామని.. గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆరోపించారు. నిమ్స్ లో నెలకు 8 మందికి బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంట్ చేస్తుండగా.. ఎంఎన్ జే లో లో రెండు చేస్తున్నారన్నారు. ఈ థియేటర్స్ కారణం గా మరిన్ని ట్రాన్స్ ప్లాంటేషన్ లకు ఆస్కారముంటుందని చెప్పారు. 33 జిల్లాల్లో పాలియేటివ్ కేర్ ను అందిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు తెలిపారు. ఆహారపు అలవాట్లు, పొల్యూషన్ వంటి కారణాలతో... క్యాన్సర్ పెరుగుతుందని చెప్పారు. కోటి రూపాయిలతో ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ వెహికల్ జిల్లాలలో తిరుగుతుందని, దీని కోసం 22 క్యాంపులు పెట్టి... స్క్రీనింగ్ చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే 5 మెడికల్ కాలేజీలకు ఎంఎన్ సీ నుంచి పర్మిషన్ వచ్చిందన్న మంత్రి... 33 జిల్లాల్లో నర్సింగ్ కాలేజీలు రాబోతున్నాయని వెల్లడించారు. ప్రభుత్వ హాస్పిటల్ లో దేశంలోనే తొలిసారి... రోబోటిక్ థియేటర్ ను మన రాష్ట్రంలో తీసుకొచ్చామని హరీష్ రావు తెలిపారు. డైట్ మెనూను రూ.56  నుంచి రూ.112 లకు పెంచామని చెప్పారు.