- కన్నవారిని నిర్లక్ష్యం చేసే పిల్లలకు.. కొత్త చట్టం ఒక గుణపాఠం
- ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులతో పాటు ప్రజా ప్రతినిధులకూ వర్తింపు
- ‘తల్లిదండ్రుల సంరక్షణ, సంక్షేమ బిల్లు’పై చర్చలో సీఎం రేవంత్ స్పీచ్
- బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిన అసెంబ్లీ
హైదరాబాద్, వెలుగు: కన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే వ్యక్తులు ఈ సమాజంలో మనుషులుగా జీవించడానికి అర్హులు కారని, అలాంటి వారిని సామాజికంగా బహిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అసెంబ్లీలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రవేశపెట్టిన ‘తల్లిదండ్రుల సంరక్షణ, సంక్షేమ బిల్లు’ను ఆదివారం సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా సీఎం ప్రసంగించారు.
ఈ చట్టం కేవలం ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకే కాకుండా ప్రజా ప్రతినిధులకు కూడా వర్తిస్తుందని స్పష్టం చేశారు. “ఈ చట్టంతో అన్ని సమస్యలు తీరుతాయని అనుకోవట్లేదు. కానీ, ఇది వృద్ధ తల్లిదండ్రులకు ఒక శక్తిని, నమ్మకాన్ని ఇచ్చే మంత్రదండం లాంటిది. కన్నవారిని చూసుకోనివారికి బుద్ధి చెప్పడానికే ఈ చట్టం తెచ్చాం” అని ఆయన పేర్కొన్నారు.
ఒక ప్రజా ప్రతినిధి తండ్రికి క్యాన్సర్ వస్తే కనీసం పట్టించుకోలేదని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. తల్లిదండ్రులను కావిడిలో మోసిన శ్రవణ కుమారుడిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. రేమండ్స్ మాజీ అధినేత విజయ్ పథ్ సింఘానియా విషాద ఉదంతాన్ని కూడా ఈ సందర్భంగా సీఎం ఉదహరించారు.
వెయ్యి కోట్ల ఆస్తిని కొడుకుకు రాసిచ్చాక, చివరికి అద్దె ఇంట్లో అనామకుడిగా ఆయన కన్నుమూయడం నేటి సమాజపు చీకటి కోణమని ఆవేదన వ్యక్తం చేశారు. “పిల్లలను కనగలం కానీ, వాళ్ల బుద్ధులను కనగలమా అన్నట్లుంది నేటి పరిస్థితి. బతికున్నప్పుడు అన్నం పెట్టని బిడ్డలు, చనిపోయాక ఆస్తుల కోసం కొట్లాడుకోవడం అత్యంత దురదృష్టకరం” అని అన్నారు.
చట్టాల రక్షణ అందరికీ ఉండాలి..
దేశంలో పిల్లల కోసం ఆర్టికల్ 21(ఏ), 24, పోక్సో, జువెనైల్ జస్టిస్ యాక్ట్ వంటి అనేక చట్టాలు ఉన్నాయని.. అలాగే మహిళలకు గృహహింస, నిర్భయ చట్టాలు ఉన్నాయని సీఎం రేవంత్ గుర్తు చేశారు. వృద్ధులకు కూడా అదే స్థాయి రక్షణ కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ‘అడ్డాల నాడే బిడ్డలు తప్ప.. గడ్డాల నాడు కాదు’ అనే పరిస్థితి రాకూడదని, ఏ తల్లిదండ్రులూ అనాథలుగా మిగిలిపోకూడదని ఆయన స్పష్టం చేశారు.
కాగా, తల్లిదండ్రులను హింసించే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత విధించాలని బీజేపీ సభ్యుడు పాయల్ శంకర్ కోరారు. అలాగే పది వేల రూపాయల భరణం సరిపోదని, పెంచాలని సూచించారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ప్రకారం ప్రస్తుతం రూ.10 వేల పరిమితి ఉందని, అందుకే దానికి కట్టుబడి ఉండాల్సి వచ్చిందన్నారు.
మరిన్ని చర్యలు తీసుకోవాలి: కూనంనేని
అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన తల్లిదండ్రుల సంరక్షణ, సంక్షేమ బిల్లును సభ్యులు చరిత్రాత్మకమైన నిర్ణయంగా స్వాగతించారు. ఈ సందర్భంగా సీపీఐ ఎంఎల్ఏ కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమవుతోందని, పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో వృద్ధ తల్లిదండ్రులను పిల్లలు నిర్లక్ష్యం చేయడం బాధాకరమని పేర్కొన్నారు.
అనాథ ఆశ్రమాల నిర్వహణలో మానవీయ కోణాన్ని చూడాలని, వృద్ధుల సంక్షేమం కోసం మరిన్ని చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది నారాయణ పాట ద్వారా తల్లిదండ్రుల గొప్పతనాన్ని తెలియజేశారు. ఇలాంటి చట్టం తీసుకురావడం స్వాగతించదగిన విషయమన్నారు.
ప్రతి ఒక్కరూ భయపడేలా చట్టం ఉండాలి: పాయల్ శంకర్
కొందరు చదువుకున్న వాళ్లు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు తల్లిదండ్రుల పట్ల వ్యవహరించే తీరును చూస్తే మనుషులా.. రాక్షసులా అనిపిస్తోందని బీజేఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ అన్నారు. తల్లిదండ్రులను పట్టించుకోకుండా హింసిస్తున్న వాళ్ల జీతంలో 15 శాతం కోత విధించాలని డిమాండ్ చేశారు. గతంలో వృద్ధాశ్రమాలు లేకపోయేదని, ఇప్పుడు అనేక వృద్ధాశ్రమాలు పెరిగిపోయాయన్నారు.
గతంలో వృద్ధాశ్రమాల్లో అనాథలు ఉండేదని, ఇప్పుడు అందరూ ఉన్నా అనాథ ఆశ్రమాల్లో పిల్లలు వేస్తున్నారని పేర్కొన్నారు. ఈ బిల్లు తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా మిగతా వాళ్లు కూడా భయపడేలా చట్టం ఉండాలని అభిప్రాపడ్డారు.
విలువలు, ప్రేమాభిమానాలు పెంచుకోవాలి: కొండా సురేఖ
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం మంచిది కాదని మంత్రి కొండా సురేఖ అన్నారు. విలువలు, ప్రేమాభిమానాలు పెంచుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. తల్లిదండ్రులను మంచిగా చూసుకోవడానికి ఓ బిల్లు తీసుకురావాల్సిన పరిస్థితులు రావడం దురదృష్ట కరమన్నారు. తల్లిదండ్రుల బాగు కోసం సీఎం రేవంత్ రెడ్డి ఇంత మంచి చట్టాన్ని తీసుకురావడం మంచి పరిణామమన్నారు.
