మేమేం ఫాంహౌస్ లో పనిచేసే పాలేరులం కాదు: ఆర్టీసీ జేఏసీ

మేమేం ఫాంహౌస్ లో పనిచేసే పాలేరులం కాదు:  ఆర్టీసీ జేఏసీ

సీఎం కేసీఆర్ బెదిరింపులకు భయపడేది లేదని, తాము న్యాయ బద్ధంగానే సమ్మె చేస్తున్నామన్నారు ఆర్టీసీ జేఏసీ నేతలు. సోమవారం ఉదయం అమరవీరులకు నివాళులర్పించేందుకు వచ్చిన ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలను గన్ పార్క్ వద్ద పోలీసులు అరెస్ట్ చేసి, ఆ తర్వాత విడుదల చేశారు.

అనంతరం ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయానికి చేరుకున్న నేతలు,  మీడియాతో మాట్లాడుతూ…  ఖచ్చితంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందేనని అన్నారు.  తాము న్యాయ సలహా తీసుకునే సమ్మె చేస్తున్నామని, తమ ఉద్యమం న్యాయబద్ధమేనని అన్నారు.  ఉద్యమాలతో సీఎం అయ్యి, ఉద్యమాలను అణిచి వేసే సీఎం గా కేసీఆర్  చరిత్రలో నిలిచి పోతారన్నారు.

సమ్మె చేస్తున్న వారిని విధుల నుంచి బహిష్కరిస్తామంటున్న సీఎం ప్రకటనలకు భయపడేది లేదని, సమ్మె చేస్తున్న వారిలో 4గురిని కూడా డిస్మిస్ చేసే పరిస్థితి లేదని జేఏసీ నేతలు అన్నారు. సమ్మె విజయవంతంగా సాగుతుంది. 50 వేల జీతం అంటూ అబద్ధపు ప్రచారం చేస్తున్నారు.

సీఎం కేసీఆర్ పక్కనున్న ఏపీని వదిలిపెట్టి ఇతర రాష్ట్రాలతో ఆర్టీసీ ని పోల్చుతున్నారని, ఏపీ లో అక్కడి ప్రభుత్వం ఇప్పటికే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిందని గుర్తు చేశారు. తామేమిమ కేసీఆర్ ఫామ్ హౌస్ లో పని చేసే పాలేరులం కాదని అన్నారు.  ఎల్లుండి (బుధవారం) భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వారు అన్నారు.