- స్పీకర్ ముందు వాదించిన తెల్లం, సంజయ్ తరఫు న్యాయవాదులు
- పార్టీ ఫిరాయించారనేందుకు తమ వద్ద ఆధారాలున్నాయ్: పిటిషినర్ల తరఫు లాయర్లు
- నేటితో పూర్తికానున్న 8 మంది ఎమ్మెల్యేల విచారణ
హైదరాబాద్, వెలుగు: భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఇప్పటికీ బీఆర్ఎస్‌లోనే కొనసాగుతున్నారని వారి తరఫు న్యాయవాదులు వెల్లడించారు. తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిశారే తప్ప కాంగ్రెస్ పార్టీలో చేరలేదన్నారు. పార్టీ ఫిరాయింపుల కేసులో ఈ ఇద్దరి ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లపై బుధవారం స్పీకర్ ఎదుట వాదనలు జరిగాయి.
ఇందులో ఈ ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీశ్ రెడ్డి, కేపీ వివేకానంద తరఫు అడ్వకేట్లు కూడా తమ వాదనలు వినిపించారు. అసెంబ్లీలోని ట్రిబ్యునల్ కార్యాలయంలో చైర్మన్ హోదాలో స్పీకర్ గడ్డం ప్రసాద్ సమక్షంలో విచారణ కొనసాగింది. ఇరు వర్గాల నుంచి ఎమ్మెల్యేలు కాకుండా వారి తరఫున అడ్వకేట్లు మాత్రమే హాజరై తమ వాదనలను వినిపించారు.
ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, సంజయ్ తరఫు అడ్వకేట్లు వాదిస్తూ.. తమ క్లయింట్లు ఇప్పటికీ బీఆర్ఎస్‌లోనే కొనసాగుతున్నారని, కాంగ్రెస్‌లో చేరలేదని స్పష్టం చేశారు. పిటిషన్ల తరుఫు న్యాయవాదులు వాదిస్తూ.. తెల్లం వెంకట్రావు, సంజయ్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరినట్లు పక్కా ఆధారాలు ఉన్నాయని, వీరిపై అనర్హత వేటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా పలు అంశాలను లేవనెత్తినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన ఆధారాలను స్పీకర్‌కు అందించినట్లు సమాచారం. ఇరువర్గాల వాదనలను విన్న స్పీకర్ విచారణను ముగించారు.
నేడు పోచారం, అరికెపూడి గాంధీ విచారణ..
గురువారం మరో ఇద్దరు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికెపూడి గాంధీలను విచారించనున్నారు. బుధవారంతో మొత్తం ఆరుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణను స్పీకర్ ముగించారు. మొదటి విడతలో నలుగురు ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి విచారణ పూర్తయింది. బుధవారం తెల్లం వెంకట్రావు, సంజయ్‌ల విచారణ పూర్తయింది.
గురువారంతో పోచారం, అరికెపూడి సహా మొత్తం 8 మంది ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విచారణ పూర్తికానుంది. అనంతరం ఈ వారంలోపే వీరిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ తుది తీర్పు ఇవ్వనున్నట్లు కార్యాలయ వర్గాలు చెప్తున్నాయి. కాగా, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇంతవరకు స్పీకర్ నోటీసులకు స్పందించకపోవడంతో పాటు, విచారణకు కూడా వారు దూరంగా ఉన్నారు.
