మున్సిపల్‌‌ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలి.. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలి : మంత్రి సీతక్క

మున్సిపల్‌‌ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలి.. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలి : మంత్రి సీతక్క

జనగామ అర్బన్/పాలకుర్తి, వెలుగు : ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేసి మున్సిపల్‌‌ ఎన్నికల్లో విజయం సాధించాలి అని మంత్రి సీతక్క సూచించారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌‌రెడ్డి, కలెక్టర్‌‌ రిజ్వాన్‌‌ బాషా షేక్‌‌, డీసీసీ అధ్యక్షురాలు లకావత్‌‌ ధన్వంతి, నియోజకవర్గ ఇన్‌‌చార్జి కొమ్మూరి ప్రతాప్‌‌రెడ్డితో కలిసి శుక్రవారం జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. 

అనంతరం పట్టణంలో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలని చెప్పారు. మనలో మనం ఎన్ని గొడవలు పెట్టుకున్నా బయటకు వెళ్లినప్పుడు మాత్రం అందరం కాంగ్రెస్‌‌ బిడ్డలమేనన్నారు. రాష్ట్రంలో అత్యధిక మున్సిపాలిటీలు కైవసం చేసుకోవాలని సూచించారు.

 అంతకుముందు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డితో కలిసి సోమేశ్వర స్వామిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఇందిరా మహిళా శక్తి ఎస్‌‌ఎల్‌‌ఎన్‌‌ ఫంక్షన్‌‌హాల్‌‌లో భోజనశాలను ప్రారంభించారు. మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతోనే  ఎం రేవంత్‌‌రెడ్డి రూ. 40 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చారన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌‌ కలెక్టర్‌‌ పింకేశ్‌‌కుమార్‌‌, ఆర్డీవో గోపీరాం, తహసీల్దార్‌‌ మోహసిన్, జడ్పీ సీఈవో మాధురిషా, మున్సిపల్‌‌ కమిషనర్‌‌ మహేశ్వర్‌‌రెడ్డి పాల్గొన్నారు.

కాంగ్రెస్, బీఆర్‌‌ఎస్‌‌ కార్యకర్తల వాగ్వాదం

జనగామ, వెలుగు : మంత్రి సీతక్క పర్యటన సందర్భంగా కాంగ్రెస్‌‌, బీఆర్‌‌ఎస్‌‌ లీడర్ల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. జనగామ శివారులో వరంగల్‌‌ – హైదరాబాద్‌‌ హైవేపై ఫౌంటెన్‌‌ శిల్పాలను ఆవిష్కరించేందుకు మంత్రి సీతక్కతో పాటు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌‌రెడ్డి వచ్చారు. దీంతో పలువురు కాంగ్రెస్‌‌ కార్యకర్తలు ‘గో బ్యాక్‌‌ పల్లా’ అంటూ నినాదాలు చేశారు. స్పందించిన బీఆర్‌‌ఎస్‌‌ కార్యకర్తలు ‘పల్లా జిందాబాద్, కాంగ్రెస్‌‌ డౌన్‌‌డౌన్‌‌’ అంటూ ప్రతినినాదాలు చేశారు. 

అనంతరం చౌరస్తాలో జరిగిన కార్యక్రమానికి వచ్చిన పల్లాను అడ్డుకునేందుకు కాంగ్రెస్‌‌ కార్యకర్తలు యత్నించగా.. బీఆర్‌‌ఎస్‌‌ నాయకులు ప్రతిఘటించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో వారిని సైతం నెట్టేయడంతో పోలీసులు, కార్యకర్తలు కిందపడిపోగా.. ఓ కానిస్టేబుల్‌‌ గాయపడ్డాడు. 

బతుకమ్మకుంట డెవలప్‌‌మెంట్‌‌, వెజ్‌‌, నాన్‌‌వెజ్‌‌ మార్కెట్‌‌ వద్ద సేమ్‌‌ సీన్‌‌ రిపీట్‌‌ కావడంతో మంత్రి సీతక్క అసహనం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలతో మంత్రి సీతక్క బచ్చన్నపేట పర్యటనను రద్దు చేసుకున్నారు.