
న్యూఢిల్లీ: అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంపై పాకిస్తాన్ చేసిన డ్రోన్లు, మిసైళ్ల దాడిని మన ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ సమర్థంగా తిప్పికొట్టిందని ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. పాక్ నుంచి వందలాది డ్రోన్లు, మిసైళ్లతో దాడి జరిగినప్పటికీ.. గోల్డెన్ టెంపుల్‌పై ఒక్క గీత కూడా పడనివ్వలేదని స్పష్టం చేసింది. మనదేశంలో ఎవరికీ, ఎలాంటి ఆస్తికీ నష్టం జరగకుండా ఆ డ్రోన్లు, మిసైళ్లన్నింటినీ మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పడగొట్టిందని చెప్పింది.
ఆపరేషన్ సిందూర్ ప్రారంభించిన మరుసటి రోజు మే 8న పాకిస్తాన్ మన దేశంలోని మతపరమైన స్థలాలు, సైనిక శిబిరాలపై చేసిన దాడి, దానిని తిప్పికొట్టిన తీరును ఆర్మీ మేజర్ జనరల్ కార్తీక్ సి శేషాద్రి సోమవారం మీడియాకు వెల్లడించారు. ఆకాశ్ మిసైల్ సిస్టమ్, ఎల్ 70 డిఫెన్స్ గన్స్ వంటి అత్యాధునిక రక్షణ వ్యవస్థలను ఉపయోగించి పాక్ దాడి నుంచి పంజాబ్‌ను రక్షించిన తీరును కూడా సైన్యం సోమవారం ప్రదర్శించింది.
పాక్ దాడిని ముందే ఊహించినం..
ఆపరేషన్ సిందూర్ ప్రారంభించిన మరుసటిరోజున మానవ రహిత వెపన్స్, డ్రోన్లు, లాంగ్‌రేంజ్ మిసైళ్లను పాకిస్తాన్ మన దేశంమీదికి భారీ సంఖ్యలో ప్రయోగించిందని శేషాద్రి తెలిపారు. ఇలా జరుగుతుందని తాము ముందే ఊహించి అందుకు తగ్గట్టుగా ప్లాన్ చేశామన్నారు. తాము ఊహించినట్లే గోల్డెన్ టెంపుల్ టార్గెట్‌గా పాక్.. వందలాది డ్రోన్లు, మిసైళ్ల దాడి చేపట్టిందన్నారు. వాటన్నింటినీ మన సైన్యం గాల్లోనే పేల్చివేసిందన్నారు. అందుకు ఆకాశ్ మిసైళ్లు, ఎల్70 వంటి ఎయిర్ డిఫెన్స్ గన్స్ ఉపయోగించామన్నారు.
స్వర్ణ దేవాలయానికి ఎటువంటి నష్టం కలగకుండా రక్షించామన్నారు. పాకిస్తాన్ మురిద్కేలోని లష్కరే, బహల్పూర్‌లోని జైషే మహమ్మద్ వంటి టెర్రరిస్ట్‌ల ప్రధాన స్థావరాలను మాత్రమే మన బలగాలు ధ్వంసం చేశాయని మేజర్ జనరల్ గుర్తుచేశారు. కానీ, పాకిస్తాన్ మన దేశంలోని అనేక సివిలియన్స్ ఉండే ప్రాంతాలు, ఆర్మీ క్యాంపులపైకి డ్రోన్లు, మిసైళ్లను వదిలిందన్నారు. వాటిలో ఒక్కదాన్నీ వదలకుండా పేల్చివేసి మన వైమానిక రక్షణ వ్యవస్థలు, సైన్యం సత్తా చాటుకున్నాయని చెప్పారు.