హైద‌రాబాద్లో నీటి కొర‌త లేకుండా చూడాలి.. సీఎం రేవంత్ ఆదేశాలు

హైద‌రాబాద్లో నీటి కొర‌త లేకుండా చూడాలి.. సీఎం రేవంత్  ఆదేశాలు

హైద‌రాబాద్లో మంచి నీటి కొర‌త లేకుండా చూడాల‌ని అధికారలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. స్థానిక చెరువుల‌ను స్టోరేజీ ట్యాంకులుగా ఉప‌యోగించుకోవాల‌ని సూచించారు.  హెచ్ఎండీఏ  కార్యాల‌యంలో వాట‌ర్ వ‌ర్క్స్‌, మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్‌, జీహెచ్ఎంసీపై సీఎం రేవంత్ రెడ్డి స‌మీక్ష నిర్వహించారు.  మ‌ల్లన్న సాగ‌ర్‌, కొండ‌పోచ‌మ్మ, రంగ‌నాయ‌క సాగ‌ర్ ప్రాజెక్టుల నుంచి హైద‌రాబాద్‌కు తాగు నీటి స‌ర‌ఫ‌రా అయ్యేలా ప్రణాళిక ర‌చించాల‌ని సీఎం ఆదేశించారు. ఔట‌ర్ రింగు రోడ్డు బ‌య‌ట ఉన్న చెరువుల‌ను క్లస్టర్లుగా విభ‌జించాల‌ని సూచించారు.  వ‌చ్చే 50 ఏళ్ల తాగు నీటి అవ‌స‌రాల కోసం ప్రణాళిక‌లు సిద్ధం చేయాలని  అధికారుల‌ను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి.  

జీహెచ్ఎంసీ, హెచ్ ఎండీఏ ప‌రిధిలో బిల్డింగ్ ప‌ర్మిష‌న్స్ ఫైల్స్ క్లియ‌ర్‌గా ఉండాలన్నారు సీఎం రేవంత్.  చాలా బిల్డింగ్స్ అనుమ‌తుల‌కు సంబంధించిన ఫైల్స్ క‌నిపించ‌డం లేదని...  ఆన్‌లైన్ లేకుండా ఇష్టారీతిగా ప‌ర్మిష‌న్లు ఇచ్చారని మండిపడ్డారు. 15 రోజుల్లో హెచ్ంఎండీఏ, జీహెచ్ఎంసీలో విజిలెన్స్ దాడులు జ‌రుగుతాయని చెప్పిన సీఎం ఇష్టానుసారంగా  వ్యవ‌హ‌రించిన అధికారులు ఇంటికిపోతారని  తెలిపారు.  ఆన్‌లైన్‌లో లేకుండా ఇచ్చిన అనుమ‌తుల జాబితా త‌యారు చేయాల్సిందేనని స్పష్టం చేశారు.  హెచ్ ఎండీఏ వెబ్‌సైట్ నుంచి చెరువుల ఆన్‌లైన్ డేటా ఎందుకు డిలీట్ అవుతోందని సీఎం అధికారులను ప్రశ్నించారు.  3 వేల 500 చెరువుల డేటా ఆన్‌లైన్‌లో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. చెరువులు ఆక్రమ‌ణ‌కు గురికాకుండా వాటి వ‌ద్ద త‌క్షణ‌మే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.