వచ్చే 25 ఏళ్లలో.. అభివృద్ధి చెందిన దేశంగా భారత్

వచ్చే 25 ఏళ్లలో.. అభివృద్ధి చెందిన దేశంగా భారత్

దేశ స్వాతంత్య్ర సమరయోధుల కలలను సాధ్యమైనంత త్వరగా సాకారం చేయాల్సిన బాధ్యత భారతీయులందరిపై ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. యావత్ జీవితాన్ని దేశం కోసం అంకితం చేసిన వాళ్లను మరువలేమని పేర్కొన్నారు. 76వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు.

‘‘మంగళ్ పాండే, రాజ్ గురు, తాంతీయ తోపే, అష్ఫాకుల్లా ఖాన్, రాంప్రసాద్ బిస్మల్, భగత్ సింగ్, బిర్సా ముండా, అల్లూరి సీతారామరాజు వంటి వాళ్లు ఆంగ్లేయ పాలకులకు దడ పుట్టించారు.  రాణి లక్ష్మీ బాయి, బేగం హజ్రత్ మహల్ భారత నారీ శక్తి సంకల్పం ఎలా ఉంటుందనేది ప్రపంచానికి చూపించారు. వీరందరినీ గుర్తు చేసుకున్నప్పుడల్లా ప్రతి భారతీయుడు గర్వంతో ఉప్పొంగుతాడు’’ అని మోడీ చెప్పారు. దేశపు మట్టిపై ఉన్న ప్రేమతో స్వాతంత్య్ర సమర యోధులు వీరోచిత పోరాటం చేసి..   మనకు స్వాతంత్య్రాన్ని సాధించి పెట్టారని ప్రధాని మోడీ గుర్తుచేశారు.

మువ్వన్నెల జెండాకు మహత్తర శక్తి..

భిన్నత్వంలో ఏకత్వమే భారత్ కు ఉన్న గొప్ప మహత్తర శక్తి అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి మాతృక భారతదేశమన్నారు. ‘‘ 75 ఏళ్లలో మన దేశం ఎన్నో ఎత్తుపల్లాలను చూసింది. దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సంకల్పంతో మేం ముందుకు కదులుతున్నాం. తిరంగా యాత్రల ద్వారా యావత్ దేశం ఏకతాటిపైకి వచ్చింది. దేశాన్ని ఏకం చేసే మహత్తర శక్తి మువ్వన్నెల జెండాకు ఉందని ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలు నిరూపించాయి. ‘సబ్ కా సాత్.. సబ్ కా వికాస్’ అని మేం పిలుపునిస్తే.. ‘సబ్ కా విశ్వాస్.. సబ్ కా ప్రయాస్’ ద్వారా దేశ ప్రజలంతా మా ప్రయత్నంలో భాగస్తులయ్యారు’’ అని మోడీ అన్నారు. 

వచ్చే 25 ఏళ్లలో 5 లక్ష్యాలు.. 

‘‘ వచ్చే 25 ఏళ్లలో దేశ ప్రజలు 5 అంశాలపై ప్రధాన దృష్టిపెట్టాలి.  2047 సంవత్సరంకల్లా దేశ స్వాతంత్య్ర సమరయోధుల కలలను సాకారం చేయాలనే లక్ష్యంతో ముందుకు కదలాలి. ఆ ఐదు అంశాల్లో మొదటిది.. అభివృద్ధిచెందిన దేశంగా భారత్ ను నిలపడం. రెండోది..  దేశంలో ఇంకా ఎక్కడైనా కొంచెం బానిసత్వం ఉన్నా నిర్మూలించాలి. మూడోది.. దేశ చరిత్ర, స్వతంత్ర పోరాట యోధుల త్యాగాలపై  గౌరవం ఉండాలి.  నాలుగోది.. ప్రజలంతా ఐకమత్యంతో ముందుకు సాగాలి. ఐదోది.. దేశం కోసం దేశ లక్ష్యాల కోసం కృషిచేయాలనే వజ్ర సంకల్పం మనలో ఉండాలి’’ అని మోడీ చెప్పారు.

యువతా మీరే కీలకం..

 ‘‘ప్రస్తుతం  25 ఏళ్ల వయసు ఉన్న యువత.. మరో 25 ఏళ్ల తర్వాత 50 ఏళ్లకు చేరుతారు.  అప్పటిలోగా మన  భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చే సంకల్పంతో యువత పురోగమించాలి’’ అని మోడీ పిలుపునిచ్చారు. ‘‘ మనం ఏది చేసినా.. ‘ఇండియా ఫస్ట్’ దృక్పథంతో చేయాలి. అప్పుడే దేశంలో, దేశ ప్రజల్లో ఐకమత్య భావన ఏర్పడుతుంది.  స్త్రీ, పురుష సమానత్వం లేనిదే.. సమానత్వ భావనకు పరిపూర్ణత చేకూరదు’’ అని ఆయన తెలిపారు.  మహిళలను గౌరవించడం అనేది నవ భారత కలలను సాకారం చేసేందుకు పునాదిగా మారుతుందని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు.