
హైదరాబద్ సిటీ, వెలుగు : సేవ్ హైదరాబాద్ పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని గ్రేటర్హైదరాబాద్ లీడర్లకు బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు సూచించారు. బుధవారం ఆయన బర్కత్‌పురాలోని సిటీ పార్టీ ఆఫీసులో సికింద్రాబాద్, గోల్కొండ, భాగ్యనగర్, మలక్ పేట, మేడ్చల్ అర్బన్, రంగారెడ్డి అర్బన్ ప్రాంతాల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నగరంలో కొద్దిపాటి వర్షానికే ఎక్కడికక్కడ ట్రాఫిక్ , వాటర్నిలిచిపోతోందని, వాహనాలు కొట్టుకుపోతున్నాయన్నారు.
ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్ అధికారులు తమ బాధ్యతను మరుస్తున్నారని, ఫలితంగా ప్రజల ప్రాణాలు పోతున్నాయని చెప్పారు. గణేశ్ఉత్సవాల సందర్భంగా చాలా చోట్ల కొండీలు పెట్టి దొంగ కరెంటు తీసుకుంటున్నారన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలే కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నాయని ఆరోపించారు. నగరంలో 48 కార్పొరేటర్లు గెలిచామని, మరో ఆరు నెలల్లో వచ్చే ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే విధంగా ముందుకు వెళ్లాలని కోరారు. ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా ప్లాన్ చేసుకోవాలని, నిత్యం ప్రజల్లో ఉండాలని చెప్పారు.