
సెయింట్ లూయిస్: ఇండియా గ్రాండ్ మాస్టర్, వరల్డ్ చాంపియన్ డి. గుకేశ్.. సింక్‌ఫీల్డ్ కప్‌లో పుంజుకున్నాడు. తొలి రౌండ్‌లో ఓటమిపాలైన గుకేశ్... బుధవారం నొడిర్బెక్ అబ్దుసత్తారోవ్ (ఉజ్బెకిస్తాన్) జరిగిన రెండో రౌండ్‌లో విజయాన్ని నమోదు చేశాడు. నొడిర్బెక్ సిసిలియన్ స్ట్రాటజీతో గేమ్‌ను మొదలుపెట్టగా.. గుకేశ్ టెస్టింగ్ మెథడ్‌లో ముందుకొచ్చాడు. మధ్యలో అబ్దుసత్తారోవ్ బంటును కోల్పోవడం ఇండియన్ ప్లేయర్‌కు కలిసొచ్చింది. చివర్లో ఎండ్ గేమ్ కోసం నైట్‌ను త్యాగం చేసినా.. ఉజ్బెక్ ప్లేయర్ కౌంటర్ అటాక్ చేయలేకపోయాడు. వెంటనే ఎత్తులు మార్చిన గుకేశ్ ఈజీగా గెలిచాడు.
ప్రజ్ఞానంద.. ఫ్యాబియానో కరువాన (అమెరికా) మధ్య జరిగిన గేమ్ డ్రా అయ్యింది. అలీరెజా ఫిరౌజ (ఫ్రాన్స్).. డుడా జాన్ క్రిస్టోఫ్ (పోలెండ్)పై గెలవగా, లెవోన్ అరోనియన్ (అమెరికా).. శామ్యూల్ సెవియన్ (అమెరికా), వెస్లీ సో (అమెరికా).. మ్యాక్సిమ్ వాచిర్ లాగ్రేవ్ (ఫ్రాన్స్) మధ్య జరిగిన గేమ్‌లు డ్రాగా ముగిశాయి. ఈ రౌండ్ తర్వాత ప్రజ్ఞానంద, అరోనియన్, అలీరెజా చెరో ఒకటిన్నర పాయింట్లతో టాప్–3 ప్లేస్‌ల్లో నిలిచారు. మరోవైపు గుకేశ్ ఒక పాయింట్‌తో సంయుక్తంగా నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.