కాళేశ్వరంపై మేం జ్యుడీషియల్ ఎంక్వైరీనే కోరుతం : మంత్రి శ్రీధర్​ బాబు

కాళేశ్వరంపై మేం జ్యుడీషియల్ ఎంక్వైరీనే కోరుతం :  మంత్రి శ్రీధర్​ బాబు

 

  • మేనిఫెస్టోలో అదే పెట్టినం: మంత్రి శ్రీధర్​ బాబు
  • సీబీఐ, ఈడీకి ఇస్తే బీఆర్​ఎస్, బీజేపీ ఒక్కటవుతాయన్న అనుమానముంది
  • కాగ్ వెల్లడించిన అంశాలపైనా విచారణ ఉంటుందని వ్యాఖ్య​
  • ఎంపీ ఎన్నికల్లో డబుల్ డిజిట్ సీట్లు గెలుస్తం

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం అవినీతిపై తాము జ్యుడీషియల్ ఎంక్వైరీనే కోరుతామని, మేనిఫెస్టోలో అదే పెట్టామని మంత్రి శ్రీధర్​బాబు స్పష్టం చేశారు. జ్యుడీషియల్ ఎంక్వైరీ కోసం సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని హైకోర్టును కోరామని, జడ్జీలు తక్కువ ఉన్నారని రిప్లై వచ్చిందన్నారు. సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని మరోసారి హైకోర్టుకు లేఖ రాస్తామన్నారు. కేంద్రం సీబీఐ విచారణ జరిపిస్తే తాము వద్దనమని అన్నారు. శనివారం అసెంబ్లీ లాబీల్లో మీడియాతో మంత్రి శ్రీధర్ బాబు చిట్ చాట్ చేశారు. కేంద్రం దగ్గర సీబీఐ ఒక్కటే లేదని, వాళ్లు కావాలనుకుంటే ఈడీ, చీఫ్ విజిలెన్స్ కమిషన్ తోనూ విచారణ చేయిస్తారన్నారు. అలా విచారణ జరిగితే  బీఆర్ ఎస్, బీజేపీ ఒకటవుతాయన్న అనుమానం తమకు ఉందని మంత్రి తెలిపారు. కాళేశ్వరంపై కాగ్ వెల్లడించిన అంశాలపై కూడా విచారణ జరిపిస్తామని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.

 లోక్ సభ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ డబుల్ డిజిట్ సీట్లు గెలుస్తుందని, బీఆర్ఎస్ ఒక్కటి గెలిస్తే ఎక్కువని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. శనివారం ఆయన అసెంబ్లీ కమిటీ హాల్ లో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో  రాష్ర్ట ఇరిగేషన్ అన్యాయానికి గురైందని శ్రీధర్ బాబు ఆరోపించారు. ఈ విషయాన్ని రాష్ర్ట ప్రజలకు అసెంబ్లీ సమావేశాల ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించామన్నారు. కాగ్, విజిలెన్స్ రిపోర్టులు చూస్తే బీఆర్ఎస్ అవినీతి అర్థమవుతుందని చెప్పారు. అబద్ధాలతోనే బీఆర్ఎస్ పదేండ్లు ప్రభుత్వాన్ని నడిపిందని, రాష్ట్ర పరిస్థితి ఏంటనేది తెలియజేయడం కోసమే శ్వేత పత్రాలు విడుదల చేశామని వివరించారు. 

మేడిగడ్డ ఎందుకు బీటలు పడిందో  ప్రజలకు బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ మొత్తం 45 గంటల 32 నిమిషాల పాటు జరగ్గా, 64 మంది ఎమ్మెల్యేలు జీరో అవర్ లో మాట్లాడారని మంత్రి వివరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 8 గంటలు 43 నిమిషాలు మాట్లాడితే, బీఆర్ఎస్ నేతలు 8 గంటల 41 నిమిషాలు మాట్లాడారని చెప్పారు. అధికార పార్టీకి, ప్రతిపక్షానికి మధ్య కేవలం 2 నిమిషాలే తేడా ఉందన్నారు. సభ ద్వారా ప్రజలను పక్కదారి పట్టించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రయత్నం చేశారన్నారు. ఆరు గ్యారంటీలను  ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నామని తెలిపారు.