
ముషీరాబాద్, వెలుగు: రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో మూఢనమ్మకాల నిర్మూలన చట్టం తీసుకువస్తామని టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. హేతువాది నరేంద్ర దబ్బోల్కర్ వర్ధంతి, జాతీయ సైంటిఫిక్ టెంపర్ డేను పునస్కరించుకొని బుధవారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో మూఢ నమ్మకాల నిర్మూలన చట్ట సాధన సమితి అధ్వర్యంలో చర్చాగోష్టి నిర్వహించారు.
ఈ సందర్భంగా మహేశ్కుమార్ గౌడ్ ‘మూఢ నమ్మకాల నిర్మూలన ముసాయిదా చట్టం’ పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. ఉన్నత చదువులు చదివిన వారు కూడా మూఢనమ్మకాల భ్రమలో ఉండడం బాధాకరమన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాజ్యసభలో జాతీయ స్థాయిలో చట్టం చేయాలని డిమాండ్ చేశారని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి తెలంగాణలో చట్టం చేస్తామని చెప్పారు.
సమాజాన్ని పట్టి పీడిస్తున్నయ్..
తొమ్మిది రాష్ట్రాల్లో మూఢ నమ్మకాల నిర్మూలన చట్టాలు చేశారని, తెలంగాణలోనూ చేసేందుకు సీఎం, డిప్యూటీ సిఎంలకు నివేదిక సమర్పిస్తామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు. రాష్ట్ర గ్రంథాలయ సంస్ధ చైర్మన్ డాక్టర్ రియాజ్, మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ పాల్గొన్నారు.