TSPSC బోర్డును ప్రక్షాళన చేసి ఉద్యోగాల భర్తీ పూర్తి చేస్తాం : కేటీఆర్

 TSPSC బోర్డును ప్రక్షాళన చేసి ఉద్యోగాల భర్తీ పూర్తి చేస్తాం : కేటీఆర్

మంత్రి కేటీఆర్ కీలక కామెంట్స్ చేశారు. మూడోసారి అధికారంలోకి వచ్చాక TSPSC బోర్డును ప్రక్షాళన చేసి  ఉద్యోగాల భర్తీని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.  కరీంనగర్​లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు.  ప్రవళ్లిక చావును ప్రతిపక్షాలు చిల్లర రాజకీయానికి వాడుకుంటున్నాయని ఆరోపించారు.  ఆమె తల్లిదండ్రులు మమ్మల్ని కలిస్తే ఆదుకుంటామని చెప్పామని అన్నారు.  

ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ బండి సంజయ్ పై కేటీఆర్ ఫైరయ్యారు.  మతం పేరుతో చిచ్చు పెట్టేటాయన ఎంపీగా గెలిచి పైసా పనైనా చేసిండా?  బడి తేలే.. గుడితేలే.  బండి సంజయ్ కు కరీంనగర్ లో పోటీ చేసే దమ్ము లేదన్నారు.   గంగులతో పోటీ అంటే టే పోచమ్మ ముందు పొట్టేలును కట్టేసినట్లేనని చెప్పారు. కాంగ్రెస్ టికెట్ ఇస్తామంటే భయపడి పారిపోతున్నారని ఎద్దేవా చేశారు.  ఒకాయన ఇప్పటికే హుస్నాబాద్ పోయిండని విమర్శించారు.  తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే పారిపోయిన కిషన్ రెడ్డి బీజేపీకి అధ్యక్షుడయ్యారని చెప్పారు. 

జనధన్ ఖాతాలో రూ.15 లక్షలు పడినోళ్లంతా బీజేపీకి, రైతుబంధు పడినోళ్లంతా తమకు ఓటేయాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ హిందవని..   కానీ ఆయనెప్పుడు మతాన్ని రాజకీయాలకు వాడుకోలేదన్నారు. కాంగ్రెస్,  బీజేపీ గెలిస్తే రాష్ట్రం మళ్లీ 50 ఏండ్లు వెనక్కి పోతుందని  కేటీఆర్​తెలిపారు.