
- అచ్చమైన ప్రజాస్వామ్యానికి ప్రతీక భద్రాద్రికొత్తగూడెం జిల్లా
- సీతారామ డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్‌కు ల్యాండ్ సేకరణ చేయండి
- వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
భద్రాద్రికొత్తగూడెం/పాల్వంచ, వెలుగు : జిల్లాలో కాపర్ మైన్స్ ఏర్పాటు కోసం ఫీజిబిలిటీ స్టడీ చేయిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో రూ. 24కోట్ల అభివృద్ధి పనులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డిలతో కలిసి శనివారం ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కలెక్టరేట్లోని ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ సందర్భించారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడారు.
.కాపర్ మైన్స్పై స్టడీ తర్వాత మైనింగ్ పనులను సింగరేణికి అప్పగిస్తామన్నారు. అచ్చమైన ప్రజాస్వామ్యానికి ప్రతీక భద్రాద్రికొత్తగూడెం జిల్లా అన్నారు. సీతారామ ప్రాజెక్ట్ ద్వారా జిల్లాలోని చెరువులను నింపి సాగునీటితో పాటు తాగునీటిని అందించేందుకు పక్కాగా ప్రణాళికలను రూపొందిస్తామని చెప్పారు. డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్‌కు అవసరమైన ల్యాండ్ సర్వే చేయాలని, అందుకు అవసరమైన నిధులు వారం రోజుల్లో రిలీజ్ చేస్తామని హామీ ఇచ్చారు.
కాలువలు లేకుండా ప్రాజెక్టులు కట్టి వృథా అని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం అదే చేసిందన్నారు. రాజీవ్ యువ వికాసం ద్వారా జూన్ 2 నుంచి 9వ తేదీ వరకు సెలెక్షన్స్ పూర్తి చేయడంతో పాటు సాంక్షన్ ఆర్డర్లు ఇస్తారని చెప్పారు. ఇందిర సౌర గిరిజనం స్కీం ద్వారా చెట్లను పెంచేందుకు నీటి వసతి, సోలార్ బోర్ వెల్స్, డ్రిప్ ఇరిగేషన్‌తో పాటు మొక్కలను కూడా ఫ్రీగా ఇవ్వనున్నట్టు తెలిపారు.
నల్ల బంగారంతో రాష్ట్రానికి వెలుగులు
గిరిజన జిల్లా అయిన భద్రాద్రికొత్తగూడెంను కాంతులతో మెరిసేలా మారుస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. ఇక్కడి నల్ల బంగారం రాష్ట్రానికి వెలుగులు ఇస్తోందన్నారు. జిల్లాకు విమానశ్రయం వస్తే భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి టెంపుల్ మరింతగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. భద్రాచలానికి రైల్వే లైన్ వచ్చే అవకాశాలున్నాయని చెప్పారు.
కొత్తగూడెం నుంచి కౌటాలా, కొత్తగూడెం నుంచి వయా ఇల్లెందు మీదుగా హైదరాబాద్‌కు రహదారుల నిర్మాణాలు కొనసాగుతున్నాయని తెలిపారు. గిరిజనుల పోడు భూముల్లో వెదురుసాగుకు ప్లాన్ చేస్తున్నామన్నారు. ఆయిల్‌పామ్ తోటలకు కరెంట్ప్రాబ్లం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎర్త్ సైన్సెస్ యూనివర్శిటీకి సంబంధించి పనులు సమ్మర్ హాలిడేస్ తర్వాత దశలవారీగా మొదలవుతాయన్నారు.
సింగరేణి ప్రాంతాల అభివృద్ధికి సాయం అందించాలని సింగరేణి సీఎండీ ఎన్. బలరామ్‌కు సూచించారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పలు సమస్యలపై భట్టికి వినతిపత్రం ఇచ్చారు. పలువురు నాయకులు, అధికారులు కూడా ఆయా సమస్యలపై డిప్యూటీ సీఎంకు వినతిపత్రాలు సమర్పించారు. ఈ ప్రోగ్రాంలో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, కార్పొరేషన్ల చైర్మన్లు పొదెం వీరయ్య, నేతలు రాయల నాగేశ్వరరావు, సింగరేణి సీఎండీ ఎన్.బలరాం నాయక్, కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఎస్పీ బి.రోహిత్ రాజు, ఐటీడీఏ పీవో రాహుల్, అడిషనల్కలెక్టర్డి.వేణుగోపాల్ తదితరలు పాల్గొన్నారు.
ప్రతిపాదనలు పరిశీలించండి
మధిర వెలుగు: మధిరలో అండర్ గ్రౌండ్ విద్యుత్ ప్రతిపాదనలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని విద్యుత్ శాఖ అధికారులను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. శనివారం మధిర పట్టణంలో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ఆయన పరిశీలించారు. మధిర పట్టణంలో ఆత్కూరు క్రాస్ రోడ్ నుంచి నందిగామ బైపాస్ రోడ్డు వరకు, ఆర్ వీ కాంప్లెక్స్ నుంచి బస్టాండ్ వరకు భూగర్భ కేబుల్స్ ద్వారా విద్యుత్ సరఫరా అయ్యేలా తయారు చేసిన ప్రతిపాదనలకు అనుగుణంగా టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తో కలిసి ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు.