వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేస్తా

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేస్తా

ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే.. తాము పరిమిత సంఖ్యలో పోటీ చేయడం జరుగుతుందని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 2022, మే 20వ తేదీ శుక్రవారం ఆయన ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటన చేపట్టిన సంగతి తెలిసిందే. రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన జనసేన కార్యకర్తల కుటుంబాలను ఆయన పరమార్శించనున్నారు. ఈ సందర్భంగా లక్కారం గ్రామానికి చెందిన కొంగర సైదులు, కోదాడకు చెందిన కడియం శ్రీనివాస్ కుటుంబాలను పవన్ పరామర్శించారు. రూ. 5 లక్షల బీమా చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా లక్కారంలో మీడియాతో మాట్లాడారు పవన్ కళ్యాణ్. 

తాను రాజకీయాల్లో ఎన్నో దెబ్బలు తినడం జరిగిందని, తాము ఆశయంతో ఉన్న వాళ్లమని తెలిపారు. కనీసం 20 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని తాము అనుకుంటున్నట్లు వెల్లడించారు. జనసేన ఎక్కడకు వెళ్లినా.. 5 వేల నుంచి 6 ఓట్లు వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థులతో పాటు అందరూ కలిసి పోరాడినట్లు గుర్తు చేశారాయన. ప్రస్తుతం కొత్త యువతరం రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో సామాజిక మార్పు రావాలని.. అట్టడుగు స్థానంలో ఉన్న వారు పైకి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణలో జనసేన నాయకులు తిరిగి.. ప్రజా సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. హైదరాబాద్ లో కార్యాలయం తీసుకుని.. తాను అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు.

జన్మ ఏపీ రాష్ట్రం ఇస్తే.. పునర్ జన్మ తెలంగాణ ఇచ్చిందన్నారు. విభజన తర్వాత కొన్ని పార్టీలు నిలబడ్డాయని, ఈ పార్టీల మధ్య జనసేన ఎలా నిలబడాలనే దానిపై రూట్ మ్యాప్ ఖరారు చేయడం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కమిటీలు వేయడానికి తాము సమయం తీసుకుంటామన్నారు. వచ్చే ఎన్నికల్లో పరిమితమైన పాత్ర పోషించాలని అనుకుంటున్నట్లు.. చనిపోయిన జనసేన సైనికుల కుటుంబాలను పరామర్శించడానికి తాను ఇక్కడకు రావడం జరిగిందన్నారు పవన్ కళ్యాణ్. 

మరిన్ని వార్తల కోసం : -

దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసు.. హైకోర్టుకు బదిలీ


నల్గొండ కు పవన్..మెట్టుగూడ వద్ద ఫ్యాన్స్ ఘనస్వాగతం