యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట మున్సిపాలిటీని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసి మోడల్ మున్సిపాలిటీగా మారుస్తామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య స్పష్టం చేశారు. బుధవారం పట్టణంలోని 9, 10 వార్డులలో నిర్వహించిన మార్నింగ్ వాక్ కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల యాదగిరిగుట్ట పట్టణం తీవ్రంగా నష్టపోయిందని, ఆలయ పునర్నిర్మాణం పేరుతో పట్టణాన్ని అతలాకుతలం చేశారని ఆరోపించారు. స్థానిక ప్రజలతో పాటు భక్తుల సౌకర్యార్థం డ్రైనేజీ, సీసీ రోడ్లు, తాగునీరు లాంటి మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, అండర్ డ్రైనేజీ పనులు పూర్తయిన తర్వాతే రోడ్ల నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
