POK మనదే.. కశ్మీర్ కోసం మేం ప్రాణాలిస్తాం: అమిత్ షా

POK మనదే.. కశ్మీర్ కోసం మేం ప్రాణాలిస్తాం: అమిత్ షా

జమ్ముకశ్మీర్ పునర్విభజన, జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ బిల్లు-ఆర్టికల్ 370 రద్దు బిల్లులపై లోక్ సభలో చర్చ సందర్భంగా వాడీవేడీ వాదనలు జరిగాయి. విపక్షాల ప్రశ్నలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పదునైన మాటలతో బదులిచ్చారు. కశ్మీర్ కోసం మేం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు అమిత్ షా.

“కశ్మీర్ సమస్య అనేది భారత్, పాక్ సంబంధించిన అంశం అనీ.. దీనిపై ఈ రెండు దేశాలే చర్చించుకుంటాయని.. మధ్యవర్తిత్వం అవసరం లేదని… ఇటీవలే అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియోతో భారత విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ చెప్పారు. ఇప్పుడు కూడా కశ్మీర్ భారత్, పాక్ మధ్య సమస్యగానే ఉండబోతుందా…” అని కాంగ్రెస్ లోక్ సభాపక్ష నాయకుడు ఆధిర్ రంజన్ చౌదరి .. అమిత్ షాను అడిగారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ సంగతేంటి అని విపక్షాల సభ్యులు కూడా ప్రశ్నించారు.

అందుకు అమిత్ షా సీరియస్ గా స్పందించారు. “జమ్ముకశ్మీర్ అనేది ఇండియాతో వేరుచేయలేని ప్రాంతం. అది ఎప్పటికీ ఇండియాదే. అదే మాట ఇండియా రాజ్యాంగంలోనూ.. కశ్మీర్ రాజ్యాంగంలోనూ ఉంది. నేను జమ్ముకశ్మీర్ అని అన్నానంటే.. అందులో పాక్ ఆక్రమిత కశ్మీర్, అక్సాయ్ చిన్ ప్రాంతం కలుపుకుని చెప్పినట్టే. పీఓకే ఇండియాలో ఉందని మీరు అంగీకరించడం లేదా.. ” అని అమిత్ షా గొంతు పెంచి ప్రశ్నించారు.

సమాధానం చెప్పండి.. అలా ఎందుకు ఆవేశపడుతున్నారు అని ఆధీర్ రంజన్ చౌదరి .. అమిత్ షాను అడిగారు. అందుకు మరింత ఆవేశంగా అమిత్ షా స్పందించారు. “నేను కచ్చితంగా ఆవేశంగా, దూకుడుగానే స్పందిస్తా.. ఎందుకంటే మేం కశ్మీర్ కోసం చచ్చిపోవడానికి, ప్రాణాలు ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నాం ” అని షా చెప్పారు. కశ్మీర్ కోసం ప్రాణాలిస్తామని రెండుసార్లు చెప్పారు అమిత్ షా.