రైతుబంధు ఆపిన సన్నాసులా మాట్లాడేది? -సీఎం రేవంత్రెడ్డి

రైతుబంధు ఆపిన సన్నాసులా మాట్లాడేది? -సీఎం రేవంత్రెడ్డి

గతంలో మార్చి వరకు రైతు బంధు ఆపిన సన్నాసులే ఇప్పుడు మాట్లాడుతున్నారు.. ఫిబ్రవరి నెలాఖరులోగా అందరికి రైతు భరోసా ఇస్తామని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లోని ఎల్బీస్టేడియంలో జరిగిన కాంగ్రెస్ బూత్ లెవెల్ కార్యకర్తల సమావేశంలో  ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తల కష్టంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్నారు. వారి చెమటతో నేను సీఎం అయ్యానని అన్నారు. మా ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు కాలేదు.. వాళ్ల పాలనలో ఏమీ చేయలేని సన్నాసులు.. బిల్లా రంగాలు ప్రభుత్వంపై దుష్ప్రచారానికి బయల్దేరారు అని రేవంత్ రెడ్డి  అన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్రాన్ని గత పాలకులు తీసుకొచ్చారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. 

దేశంలో త్యాగం అంటే గాంధీ ఫ్యామిలీదే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాజీవ్ వీర మరణం తర్వాత ప్రజలకోసం సోనియాగాంధీ ముందుకు వచ్చారన్నారు.గాంధీ కుటుంబం త్యాగాలు చేసినప్పుడు  ప్రధాని మోదీ ఎక్కుడున్నారని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. దేశంలో పాలనపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దేశాన్ని కాపాడటం కోసం ఇందిరాగాంధీ ప్రాణ త్యాగం చేశారన్నారు. ఎన్నో పదవులు సోనియా గాంధీ త్యాగం చేసిందన్నారు. 2004, 2009లో ప్రధాని అయ్యే అవకాశం ఉన్నా సోనియా గాంధీ పదవి వదులుకున్నారని చెప్పారు. యువతకు కంప్యూటర్లు, 18 యేళ్లకే ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీదే అన్నారు. 

సోనియాగాంధీ,రాహుల్ ను వేధించేందుకే ప్రధాని మోదీ ఈడీ, సీబీఐ కేసులు పెడుతున్నారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. రాహుల్ పాదయాత్రలో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. ప్రజల సంక్షేమం, అభివృద్ది కోసం పనిచేసే కాంగ్రెస్ పార్టీని లోక్ ఎన్నికల్లో గెలుపుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు.