
న్యూఢిల్లీ: ఇండియాలో ఉన్న పాకిస్తానీ పౌరులు తిరిగి తమ దేశానికి వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం గడువు పొడిగించింది. తదుపరి ఆదేశాలు వచ్చే దాకా అటారీ–వాఘా బార్డర్ తెరిచి ఉంచుతామని కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారంతోనే గడువు ముగిసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నది. అటారీ వద్ద ఉన్న ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ద్వారా ఇండియాలో ఉన్న పాక్ పౌరులంతా సాధ్యమైనంత త్వరగా వెళ్లిపోవాలని సూచించింది. గతంలో విధించిన ఆంక్షల్లో స్వల్పంగా మార్పులు చేస్తున్నట్లు తెలిపింది.
కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో ఇండియాలోనే ఉన్న పాకిస్తాన్ పౌరులకు కొంత ఊరట లభించినట్లయింది. పాకిస్తాన్ పౌరులు పెద్ద ఎత్తున ఇప్పటికే అటారీ–వాఘా బార్డర్కు చేరుకున్నారు. కాగా, అటారీ–వాఘా బార్డర్ గురువారం తెరుచుకోలేదు. ఇండియా నుంచి పాకిస్తాన్లోకి.. పాకిస్తాన్ నుంచి ఇండియాలోకి ఎవరూ అడుగుపెట్టలేదు. బుధవారం 125 మంది పాకిస్తానీ పౌరులు బార్డర్ దాటారు. అదేవిధంగా, ఇండియా నుంచి పాకిస్తాన్ కు మొత్తం 23 మంది వెళ్లిపోయారు. వీరిలో పాకిస్తాన్ వీసా కలిగిన 15 మంది ఇండియన్ సిటిజన్స్ ఉన్నారు.
గురువారం మాత్రం పాక్ వైపు గేట్లు ఓపెన్ చేయలేదు. గడిచిన ఏడు రోజుల్లో 911 మంది పాకిస్తానీయులు పంజాబ్లోని అమృత్సర్ జిల్లా ఇంటర్నేషనల్ బార్డర్ క్రాసింగ్ పాయింట్ ద్వారా లాంగ్ టర్మ్ వీసా ఉన్న 152 మంది ఇండియన్స్, 73 మంది పాకిస్తానీ పౌరులు బార్డర్ దాటారు. ఈ పాయింట్ నుంచి ఇండియాలోకి మొత్తం 1,617 మంది వచ్చారు. వీరిలో 25 మంది డిప్లమాట్స్, అధికారులు, దీర్ఘకాల వీసాలు ఉన్న 151 మంది పౌరులు ఉన్నారు. ఇండియా నుంచి పాక్ లోకి 224 మంది వెళ్లిపోయారు.
బార్డర్ లో కొనసాగుతున్న కాల్పులు
పాకిస్తాన్ సైన్యం మరోసారి సీజ్‌ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. గురువారం తెల్లవారుజామున లైన్ ఆఫ్ కంట్రోల్(ఎల్వోసీ) వెంబడి ఉన్న కుప్వారా, ఉరి, అఖ్నూర్ సెక్టార్లలో ఫైరింగ్ జరిపింది. వెంటనే అలర్టెయిన ఇండియన్ ఆర్మీ.. పాక్ ఆర్మీపై ఫైరింగ్ చేసింది. తాజా దాడితో.. పాకిస్తాన్ వరుసగా ఏడోసారి సీజ్‌ఫైర్ ను ఉల్లంఘించినట్టయింది.
దక్షిణ కాశ్మీర్ లోనే పహల్గాం టెర్రరిస్టులు?
పహల్గాం టౌన్ సమీపంలోని బైసరన్ వ్యాలీలో టెర్రర్ అటాక్ కు పాల్పడిన టెర్రరిస్టులు దక్షిణ కాశ్మీర్ లో దాక్కుని ఉన్నట్టు తమకు బలమైన ఆధారాలు లభించాయని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) వర్గాలు తెలిపాయి. ఈ ప్రాంతంలో ఇంకా ఎక్కువ మంది టెర్రరిస్టులు దాక్కుని ఉండొచ్చనే సమాచారం తమకు ఉందని చెప్పాయి. స్థానికులపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా టెర్రరిస్టులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు పేర్కొన్నాయి.
దాడికి పాల్పడిన వ్యక్తులు ఆహార సామగ్రి, ఇతర నిత్యావసర వస్తువులను తమతో పాటు అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారని వివరించాయి. దీంతో బయటికి రాకుండా అక్కడ ఎక్కువ కాలం ఉండటానికి అవకాశం ఉంటుందని వెల్లడించాయి.