నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపుతాం

నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపుతాం
  • మంత్రి గంగుల కమలాకర్

కరీంనగర్: నేతలన్నల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జరిగిన  వేడుకల్లో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. మేయర్ సునీల్ రావు, కలెక్టర్ కర్ణన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, నేతన్నలు పాల్గొన్నారు. 
ఈ సందర్భంగా మంత్రి  గంగుల కమలాకర్ మాట్లాడుతూ చేనేత రంగాన్ని ప్రోత్సహిద్దామని పిలుపునిచ్చారు. అందరూ చేనేత వస్త్రాలను ఆదరించాలని.. తద్వారా నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపుదామని కోరారు. నేత కార్మికులంటే ‘‘నరాలను దారాలుగా చేసి.. స్వేదాన్ని రంగులుగా మార్చి..  వస్త్రాన్ని అందించే వాళ్లు చేనేత కార్మికులు.. అంటూ మంత్రి గంగుల కమలాకర్ వివరించారు. అందుకే తమ ప్రభుత్వం నేతన్నలకు పెన్షన్లు ఇస్తూ చేయుత అందిస్తున్నదన్నారు. నేతన్నలకు చేయుత పథకం కింద రూ.368 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. రైతుబీమా మాదిరిగా చేనేత బీమా పథకం అమలు చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. వర్కర్ టు ఓనర్  స్కీం కింద సిరిసిల్లలో మరమగ్గాల కార్మికులకు ఆర్ధిక సాయం చేస్తున్నామన్నారు.