గురుకులాల్లో బిల్లులు పెండింగ్‌‌ పెట్టం..ఇకపై ప్రతి నెలా చెల్లిస్తాం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్

గురుకులాల్లో బిల్లులు పెండింగ్‌‌ పెట్టం..ఇకపై ప్రతి నెలా చెల్లిస్తాం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
  • గురుకులాల్లో కామన్‌‌ డైట్‌‌ ప్లాన్‌‌ను తప్పక పాటించాలని ఆదేశం

హైదరాబాద్, వెలుగు: గురుకుల స్టూడెంట్స్‌‌కు సంబంధించి మెస్, రెంట్, డైట్ ఇతర ఏ బిల్స్‌‌ను కూడా పెండింగ్‌‌లో పెట్టబోమని, ప్రతి నెల చెల్లించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. పెండింగ్‌‌ బిల్లులపై సీఎం రేవంత్‌‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో చర్చించామని, వెంటనే వాటిని క్లియర్ చేస్తామని చెప్పారు. ఇప్పటికే రూ.170 కోట్ల పెండింగ్‌‌ బిల్లులు రిలీజ్ చేశామని, జీతాల కోసం మరో రూ.100 కోట్లు విడుదల చేశామని తెలిపారు.

మంగళవారం సెక్రటేరియెట్‌‌లో ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణితో కలిసి మంత్రి లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్, మైనారిటీ గురుకులాల్లో నూతనంగా రూపొందించిన కామన్ డైట్‌‌ను తప్పక పాటించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు అందించాల్సిన యూనిఫామ్ ఈ నెల చివరిలోగా అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే, గురుకుల బిల్డింగ్‌‌లకు సంబంధించి అద్దె బకాయిల పెండింగ్ బిల్లులు రూ.210 కోట్లు మంజూరు చేశామన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పిస్తున్నదని చెప్పారు. గురుకుల స్టూడెంట్ల యూనిఫామ్‌‌లు, షూలపై త్వరలో టెండర్లు పిలుస్తామని తెలిపారు. అన్ని రెసిడెన్షియల్ హాస్టల్స్‌‌లో ఏప్రిల్ 2025 వరకు ఉన్న పెండింగ్ బిల్లులను మంజూరు చేశామని మంత్రి వెల్లడించారు. 

విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు చర్యలు..

విద్యార్థుల ఆత్మహత్యల నివారణ కోసం పకడ్బందీ చర్యలు చేపట్టనున్నట్టు మంత్రి లక్ష్మణ్ వెల్లడించారు. అన్ని గురుకులాల్లో నలుగురు విద్యార్థులు కలిసి ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. అకడమిక్, నాన్ అకడమిక్‌‌లో ఒక గ్రూప్‌‌గా ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థులు ఒంటరితనాన్ని దూరం చేసేందుకు దోహదపడుతుందన్నారు. ప్రతి రోజూ ఉదయం పూట 2 నిమిషాలు మెంటల్ హెల్త్‌‌పై కౌన్సెలింగ్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని, తద్వారా విద్యార్థులకు మానసిక స్థైర్యాన్ని నింపేలా చూడాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు మెను ప్రకారమే ఫుడ్‌‌ అందించాలన్నారు.