గట్టిగా బదులిస్తం .. దాడిచేసిన వారిని వదిలిపెట్టం: రాజ్​నాథ్

గట్టిగా బదులిస్తం .. దాడిచేసిన వారిని వదిలిపెట్టం: రాజ్​నాథ్
  • కుట్రపన్నిన వారిని బయటకు లాగి తగిన బుద్ధి చెప్తం
  • టెర్రరిస్టులది పిరికిపంద చర్య 
  • ఎన్ఎస్​ఏ, చీఫ్​ ఆఫ్​ డిఫెన్స్​స్టాఫ్​తోపాటు త్రివిధ దళాధిపతులతో ఉన్నత స్థాయి సమావేశం

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్​లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై  రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​సింగ్​ తీవ్రంగా స్పందించారు. ఉగ్రదాడికి పాల్పడిన వారికి త్వరలోనే గట్టిగా బదులిస్తామని వార్నింగ్​ ఇచ్చారు. కుట్ర పన్నినవారిని బయటకు లాగి తగిన బుద్ధిచెప్తామని హెచ్చరించారు. ఉగ్రదాడి నేపథ్యంలో బుధవారం  జమ్మూ కాశ్మీర్‌‌‌‌లో భద్రతా పరిస్థితిపై దాదాపు రెండున్నర గంటల పాటు రాజ్​నాథ్​ సింగ్​ సమీక్షించారు. 

ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్​ కే త్రిపాఠి, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, రక్షణ కార్యదర్శి రాజేశ్​ కుమార్ సింగ్ పాల్గొన్నారు. అనంతరం రాజ్​నాథ్​సింగ్​​ మాట్లాడుతూ.. ‘‘మాపైన అటాక్​ చేసినవారినే కాదు.. ఈ దాడులకు కుట్రపన్నినవారినీ బయటకు లాగుతాం. వారిని టార్గెట్​ చేస్తాం” అని హెచ్చరించారు. భారత్‌‌‌‌పై తెర వెనుక ఉండి కుట్ర పన్నుతున్న వారిని ఊరికే వదలబోమని గట్టి వార్నింగ్​ ఇచ్చారు.

టెర్రరిజాన్ని అంతం చేయడమే భారత్​ విధానం 

పహల్గామ్​ దాడి పిరికిపందల చర్య అని రాజ్​నాథ్​ సింగ్​ అన్నారు. ఈ దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. టెర్రరిజాన్ని అంతం చేయడమే భారత్​ విధానమని పేర్కొన్నారు. భారత్​పురాతన దేశమని, ఉగ్రవాదానికి భయపడబోదని చెప్పారు. ఉగ్రవాదులను ఎదుర్కొనే విషయంలో దేశ ప్రజలంతా ఐక్యంగా ఉన్నారని పేర్కొన్నారు. 

కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాగా, రాజ్​నాథ్​సింగ్ అధ్యక్షతన నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఉగ్రవాద దాడి తర్వాత జమ్మూ కాశ్మీర్‌‌‌‌లో తలెత్తిన పరిస్థితికి సంబంధించిన అన్ని అంశాలను చర్చించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన వివరాలు బయటకు వెల్లడించలేదు. అయితే,  సాయుధ దళాలు తమ పోరాట సన్నద్ధతను పెంచుకోవాలని, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల తీవ్రతను పెంచాలని సింగ్ ఆదేశించినట్లు తెలిసింది.

టెర్రర్ దాడి నుంచి బయటపడిన బాధితులు.. మన సైనికులను చూసి భయపడ్డారు. టెర్రరిస్టులు కూడా ఆర్మీ యూనిఫాం ధరించి రావడంతో నిజమైన సైనికులను చూసి వాళ్లు కూడా టెర్రరిస్టులే అనుకుని వణికిపోయారు. తమను, తమ పిల్లలను ఏమీ చేయవద్దంటూ చేతుల జోడించి వేడుకున్నారు. ఈ క్రమంలో జవాన్లు తాము నిజమైన సైనికులమని చెప్పి బాధితులకు భరోసా ఇచ్చారు.