కరెంట్ ఇంజినీర్ల సమస్యలు తీరుస్తం.. ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ వెల్లడి

కరెంట్ ఇంజినీర్ల సమస్యలు తీరుస్తం.. ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ వెల్లడి
  • స్టేట్​ ఇంజినీర్స్​ అసోయేషన్​ ఆధ్వర్యంలో ఇంజినీర్స్ డే వేడుకలు

హైదరాబాద్, వెలుగు: విద్యుత్​ ఇంజినీర్ల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎనర్జీ ప్రిన్సిపల్​ సెక్రటరీ నవీన్​ మిట్టల్​   అన్నారు.  సోమవారం (సెప్టెంబర్ 15) స్టేట్ పవర్  ఇంజినీర్స్  అసోసియేషన్ (టీజీపీఈఏ) ఆధ్వర్యంలో జెన్కో ఆడిటోరియంలో  58వ ఇంజినీర్స్ డే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి నవీన్​ మిట్టల్​ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నూతన నియామకాలు, ప్రమోషన్లు, ట్రాన్స్​ఫర్​ విధానం, జీపీఎఫ్ సమస్యలను త్వరలో పరిష్కరించేందుకు కృషి చేస్తామని  హామీ ఇచ్చారు. ప్రస్తుతం రెన్యువబుల్  ఎనర్జీ ఇన్​స్టాల్​ కెపాసిటీ..  సంప్రదాయ ఇంధన సామర్థ్యాన్ని మించిపోయిందన్నారు.  బ్యాటరీ స్టోరేజీ వ్యవస్థ ద్వారా కరెంటు ధరలను నియంత్రించవచ్చని తెలిపారు. ఇంధన రంగానికి కేంద్ర-, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యమిస్తున్నాయని, విద్యుత్ నెట్ వర్క్ వేగంగా విస్తరిస్తోందన్నారు. 

నెట్ వర్క్​ వైఫల్యం లేకుండా కరెంటు సరఫరా

సదరన్​ డిస్కం సీఎండీ ముషారఫ్​ ఫారుకీ మాట్లాడుతూ  హైదరాబాద్​లో కుండపోత వర్షాలు కురుస్తున్నా  ఇంజినీర్లు, సిబ్బంది కృషితో నెట్ వర్క్​ వైఫల్యం లేకుండా కరెంటు సరఫరా సాధ్యమవుతోందన్నారు.  హైదరాబాద్‌‌లో సంపూర్ణ అండర్‌‌గ్రౌండ్  కేబుల్  వ్యవస్థ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 

పవర్​ ఇంజి నీర్స్​ అసోసియేషన్​ అధ్యక్షుడు రత్నాకర్ రావు మాట్లాడుతూ  సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి నాయకత్వంలో నిరంతరాయ విద్యుత్  సరఫరా జరుగుతోందన్నారు. నెట్​వర్క్ అభివృద్ధికి తగినట్లుగా మానవ వనరుల నియామకాలు జరిగితే నిరంతర విద్యుత్  సరఫరాకు మరింత సహాయపడుతుందన్నారు.