పరిశోధన రంగంలో.. యూఎస్‌‌డీఏ సహకారం తీసుకుంటాం : నిరంజన్ రెడ్డి

పరిశోధన రంగంలో..  యూఎస్‌‌డీఏ సహకారం తీసుకుంటాం :  నిరంజన్ రెడ్డి

హైదరాబాద్‌‌, వెలుగు:  పరిశోధన రంగంలో  యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (యూఎస్‌‌డీఏ)  సహకారం తీసుకుంటామని  మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి  చెప్పారు.  అమెరికా పర్యటనలో భాగంగా గురువారం యూఎస్‌‌డీఏ ప్రతినిధులతో ఆయన చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఐటీ, ఫార్మ్ ఎకనామిక్స్, సీడ్ టెక్నాలజీ, పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్​మెంట్, మార్కెటింగ్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ తదితర రంగాల్లో కలిసి పనిచేసే అవకాశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగం అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్నదే  ప్రభుత్వ ఆకాంక్ష అని స్పష్టం చేశారు.  వ్యవసాయ, దాని అనుబంధ రంగాల్లో భావితరాలు పెట్టుబడులు పెట్టేలా ప్లాన్‌‌ చేస్తున్నట్లు చెప్పారు. 

భారత్‌‌లో వాతావరణం ఏడాది పొడవునా అన్ని కాలాల్లోనూ పంటలు పండించడానికి అనువుగా ఉంటుందన్నారు. 140 కోట్ల జనాభాకు ఆహారాన్ని అందించడంతోపాటు  విదేశాలకు ఎగుమతి చేయగలిగేలా తమ కార్యచరణ ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో ఎన్‌‌ఐఎఫ్‌‌ఏ  డైరెక్టర్ మంజిత్ మిశ్రా మాట్లాడుతూ ఏ దేశంలో అయినా వ్యవసాయ అభివృద్ధికి పరిశోధన ముఖ్యమని,  ఆ పరిశోధనను అర్థవంతమైన ఫలితాలుగా మార్చడంలో రాజకీయ నాయకుల పాత్ర చాలా కీలకం అని అన్నారు. ఈ సమావేశంలో అగ్రికల్చర్‌‌ సెక్రటరీ రఘునందన్ రావు, ఇస్టా అధ్యక్షులు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు, రాష్ట్ర డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ పాల్గొన్నారు.