ఎస్సీ వర్గీకరణ చేస్తే గుణపాఠం తప్పదు

ఎస్సీ వర్గీకరణ చేస్తే గుణపాఠం తప్పదు
  • రాజ్యాంగ వ్యతిరేక శక్తులను ఎదుర్కొంటాం: భవన్​ నాథ్​ పాశ్వాన్​
  • మంద కృష్ణ నాలుగు జన్మలెత్తినా వర్గీకరణ జరగదు: దిగంబర్​ కాంబ్లే
  • సరూర్ నగర్ స్టేడియంలో మాలల సింహగర్జన సభ: చెన్నయ్య 

ఎల్​బీ నగర్, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ పేరిట దళితులను రాజ్యాధికారానికి రాకుండా అడ్డుకుంటున్నాయని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ జి. చెన్నయ్య మండిపడ్డారు. ఏండ్లుగా మాలలకు అన్యాయం జరుగుతున్నదన్నారు. ఎస్సీ వర్గీకరణ చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి మంద కృష్ణ మాదిగ కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. ఏ పార్టీ అయిన మాలలను చిన్న చూపు చూస్తే ఖబడ్దార్​ అని హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణ చేస్తే  గుణపాఠం తప్పదన్నారు. ఆదివారం హైదరాబాద్​లోని సరూర్ నగర్ స్టేడియంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఏర్పాటు చేసిన మాలల సింహగర్జన సభలో చెన్నయ్య  మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణకు సపోర్ట్ చేసి ఓడి పోయి కనిపించకుండా పోయారని, ఇదే పరిస్థితి ఎస్సీ వర్గీకరణ చేస్తామన్న పార్టీలకు పడుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణ చేయాలని పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డితో పాటు వైఎస్సార్​టీపీ చీఫ్​ షర్మిల ప్రయత్నం చేస్తున్నారని, ఖబడ్దార్​ అని హెచ్చరించారు. 

వర్గీకరణను అడ్డుకోవడానికి రెడీ: భవన్​ నాథ్​ పాశ్వాన్​
ఎస్సీ వర్గీకరణను అడ్డుకోవడానికి మాలలు రెడీగా ఉన్నారని అంబేద్కర్  ఏక్తా మంచ్ ఆల్ ఇండియా అధ్యక్షుడు భవన్ నాథ్  పాశ్వాన్  అన్నారు. భారత రాజ్యాంగం ఆపదలో ఉందని, పార్లమెంటులో  అంబేద్కర్ ను అవమానపరిస్తే మన ఎంపీలు ఎక్కడికి వెళ్లారని ఆయన ప్రశ్నించారు.‘‘రాజ్యాంగ వ్యతిరేక శక్తులను ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నాం. మాలల నోటి కాడ ఉన్న రొట్టెను గుంజు కోవాలని చూస్తే ఊరుకోబోం. ఐక్యంగా ఎదుర్కొంటాం” అని అన్నారు. వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు  తీర్పు ఇచ్చినా ఎందుకు ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు. వర్గీకరణను ఎదుర్కొనేందుకు అస్త్రశాస్త్రాలతో మాలలంతా సిద్దంగా ఉండాలని సూచించారు.  పార్లమెంట్ లో 131 ఎస్సీ, ఎస్టీ ఎంపీ లు ఉన్నా గానీ మాల సమాజం గురించీ మాట్లాడం లేదన్నారు. తాను ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి, మాల సమాజం గురించి ఉద్యమిస్తున్నానని చెప్పారు. 

రాబోయే ఎన్నికల్లో తడాఖా చూపిస్తం: దిగంబర్​ కాంబ్లే
ఎస్సీ వర్గీకరణ అనేది ఒక వ్యవస్థ కుట్ర అని సమత సైనిక్ దళ్​ నేషనల్​ సెక్రటరీ దిగంబర్​ కాంబ్లే అన్నారు. మంద కృష్ణ నాలుగు జన్మలెత్తినా వర్గీకరణ జరగదని చెప్పారు. ‘‘పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి మాలలు కేవలం నాలుగు శాతమే ఉన్నట్లు చెప్పారు. మా తడాఖా రాబోయే ఎన్నికల్లో చూపిస్తాం’’ అని హెచ్చరించారు. మాదిగలకు మాత్రమే అన్ని రంగాల్లో  ప్రాతినిధ్యం ఇస్తున్నారని, మాలల మనోభావాలు దెబ్బ తియ్యాలని ఏ పార్టీ చూసిన తగిన గుణపాఠం చెప్తామన్నారు. కార్యక్రమంలో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు రాందాస్ సత్వాల్,  ఉపాధ్యక్షుడు వెంకటస్వామి, మాల మహానాడు ఏపీ ప్రెసిడెంట్ మల్లెల వెంకట్రావ్, తెలంగాణ మాలల ఐక్యవేదిక ప్రెసిడెంట్​ బేర బాలకిషన్​ తదితరులు పాల్గొన్నారు.

రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తే బుద్ధి చెప్తాం
అంబేద్కర్ ఎంతో కష్టపడి రాసిన రాజ్యాంగాన్ని అధికారంలో ఉన్న కొన్ని పార్టీలు మార్చాలని చూస్తున్నాయని, ఆ పార్టీలకు దళిత జాతి బుద్ధి చెప్తుందని చెన్నయ్య హెచ్చరించారు. ప్రతి రాజకీయ నాయకుడి విజయం వెనుక మాలలు ఉన్నారని, మాలలకు అన్యాయం చేస్తే.. అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కుతోనే తగిన బుద్ధిచెప్తామన్నారు.