- గల్లంతైన వారి కుటుంసభ్యులకు పరామర్శ
- బాధిత కుటుంబాకు రూ. 5 లక్షలు -కలెక్టర్ హరిచందన
హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో అవసరమైన చోట నాలాలు విస్తారిస్తామని, తప్పనిసరైన చోట ఆక్రమణలను తొలగిస్తామని హైడ్రా కమిషనర్రంగనాథ్ప్రకటించారు. వినోభానగర్, మంగారి బస్తీల్లోని నాలాల్లో ఆదివారం రాత్రి గల్లంతైన ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతుండగా కలెక్టర్హరిచందనతో కలిసి పర్యవేక్షించారు. గల్లంతైన వారి కుటుంబసభ్యులను పరామర్శించారు.
సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలాలను ఆక్రమించి కట్టుకోవడమే కాకుండా వాటి ప్రవాహాన్ని దారి మళ్లించడంతో వరద సాఫీగా సాగడంలేదన్నారు. వరద ప్రవాహానికి ప్రధాన అడ్డంకిగా ఉన్న ఒకటి, రెండు కట్టడాలను తొలగిస్తామని, మిగతా వారు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. నాలాల చెంత పేదలే ఎక్కువ సంఖ్యలో ఉంటున్నందున తప్పనిసరి కూల్చివేయాల్సి వస్తే వారికి ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపిస్తుందన్నారు.
145 ఇండ్లు నాలా మీదున్నయ్ : కలెక్టర్
అఫ్జల్ సాగర్ లో గల్లంతైన ఇద్దరి కుటుంబసభ్యులకు హైదరాబాద్ కలెక్టర్ హరిచందన రూ.5 లక్షలు అందిస్తామని ప్రకటించారు. కొన్ని నాలాలపై నిర్మాణాలుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇలాంటి వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేందుకు ప్లాన్చేస్తున్నామన్నారు. మంగారిబస్తీలో 145 ఇండ్లు నాలా మీద ఉన్నాయని, గతంలో అనేక సార్లు నోటీసులిచ్చామని కలెక్టర్ తెలిపారు.
నాలాలకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయండి: బల్దియా కమిషనర్
నాలాలకు అవసరమైన చోట ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని బల్దియా కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులకు సూచించారు. మెహదీపట్నం లోని మల్లెపల్లి నాలాను ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతితో కమిషనర్ పరిశీలించారు. కర్ణన్మాట్లాడుతూ మల్లెపల్లి నాలాలో పూడికతీత పనులను చేపట్టాలని ఆదేశించారు.
