రేపు కూడా వర్షాలు పడతాయ్: వాతావరణ శాఖ

రేపు కూడా వర్షాలు పడతాయ్: వాతావరణ శాఖ

ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. వర్షం, చలిగాలులతో జనం ఇబ్బందులు పడుతున్నారు. అకాల వర్షాలు అన్నదాతలను నష్టాల్లో పడేశాయి. వేల ఎకరాల్లో మిర్చి, పత్తి, వేరుశనగ, మొక్కజొన్న పంటలు నీటమునిగాయి.

ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం జిల్లాల్లో వర్షం కురిసింది. ఆదిలాబాద్ జిల్లాలో 12 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలోనూ రాత్రి అకాల వర్షం పడింది. ఆదిలాబాద్ లో కురిసిన వర్షానికి వాతావరణం పూర్తిగా చల్లబడింది. బయటికి రావాలంటేనే వణుకుతున్నారు జిల్లా ప్రజలు.

అకాల వర్షాలతో అన్నదాతలు నష్టపోతున్నారు. ఉదయం నుంచి మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. అకాల వర్షంతో మిర్చి, వేరుశనగ, మొక్కజొన్న పంటలకు నష్టం జరిగిందంటున్నారు రైతులు. జయశంకర్ భూపలపల్లి జిల్లాలోనూ రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో వేల ఎకరాల్లో పత్తి, మిర్చి, వరి పంటకు నష్టం జరిగింది. పంట నీట మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఖమ్మం జిల్లాలో కురిసిన అకాల వర్షం అన్నదాతలను నష్టాల్లో పడేసింది. వర్షానికి కల్లాల్లోనే తడిసి ముద్దయింది మిర్చి పంట. అమ్ముకునే సమయానికి వర్షం రావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెంతో పాటు మధిర నియోజకవర్గంలోని ముదిగొండలో వర్షం కురిసింది. పట్టాలు అందుబాటులో లేకపోవడంతోనే పంట కొట్టుకు పోయిందంటున్నారు రైతులు.

ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఎల్లుండి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందంది.

weather department report It will also rain tomorrow