కాలుష్యంతో కరువులు తీవ్రం

కాలుష్యంతో కరువులు తీవ్రం

గాలి కాలుష్యం వల్ల రోగాలొస్తాయని, యాసిడ్‌ వర్షాలు కురుస్తాయని తెలుసు. కానీ వానలు సరిగా కురవకపోవడానికి కూడా గాలి కాలుష్యమే కారణమని తాజాగా సైంటిస్టులు గుర్తించారు. ఎల్‌నినోతో కలసి కరువు తీవ్రత పెంచుతున్నాయని కనుగొన్నారు. ఎల్‌నినో సంవత్సరాల్లో దక్షిణ ఆసియా దేశాల్లో పెరిగిన గాలి కాలుష్య కారకాలు రుతుపవనాలపై ప్రభావం చూపుతున్నాయని, ఫలితంగా కరువు తీవ్రత పెరుగుతోందని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాపికల్​ మెటియరాలజీ (ఐఐటీఎం) సర్వేలో వెల్లడైంది. ఈ రెండింటి వల్ల కరువుల తీవ్రత గతంలో 17 శాతం పెరిగిందని తెలిపింది. ఆసియా ప్రాంతాల్లోని ట్రోపోపాజ్‌ ఆవరణంలో దుమ్ము కణాలు ఎక్కువై సూర్యకాంతి భూమిపై పడకుండా అడ్డుకుంటున్నాయని, దీంతో మాన్‌సూన్స్‌ బలహీనపడి కరువులు ఎక్కువవుతున్నాయని వెల్లడైంది.

దక్షిణ, తూర్పు ఆసియా దేశాల్లో ఇండస్ట్రియలైజేషన్ వల్ల వాతావరణంలో కాలుష్య కారకాలు, ఏరోసోల్స్‌ ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ఇండియా, చైనాల్లో ఇది చాలా ఎక్కువుంది. ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం ట్రోపోపాజ్‌లో పెరుగుతున్న ఏరోసోల్స్‌ తీవ్రత 2040 వరకు ఉంటుందని, కాబట్టి మున్ముందు తీవ్రమైన ఎల్‌నినో చూస్తామని ఐఐటీఎం చెప్పింది. ఏరోసోల్స్‌ ప్రభావం వల్ల మధ్య ఇండియాలో వర్షాలు సుమారు 17 శాతం వరకు తక్కువ కురిసినట్టు తెలిసిందని వివరించింది. 2009, 2015ల్లో ఏరోసోల్స్‌ ఎక్కువై మధ్య భారత్‌లో వర్షాలు 14 శాతం తక్కువ పడ్డాయని తెలిపింది. మాన్‌సూన్‌ సీజన్‌లో ఇండియా, టిబెట్‌ ప్రాంతాల్లో చల్లదనం పెరిగి దక్షిణ ఆసియా ప్రాంతాల్లో ఏరోసోల్స్‌ ఎక్కువవుతున్నాయని వివరించింది. ఎల్​నినో ఎఫెక్ట్​తో అది మరింత తీవ్రమవుతోందని చెప్పింది.

మరిన్ని వెలుగు న్యూస్ కోసం క్లిక్ చేయండి