కేరళలో భారీ వర్షాలు.. 9జిల్లాలకు ఎల్లో అలర్ట్

కేరళలో భారీ వర్షాలు.. 9జిల్లాలకు ఎల్లో అలర్ట్

కేరళలో కురుస్తోన్న భారీ వర్షాలు సామాన్య జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. నివాస గృహాల్లోకి కూడా వర్షం నీరు చేరి రోజువారీ జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ క్రమంలో నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే “అక్టోబర్ 18 వరకు రాష్ట్రంలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో తొమ్మిది జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది అని వాతావరణ శాఖ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది.

నీటి ఎద్దడికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికే హల్ చల్ చేస్తున్నాయి. వరదల కారణంగా, తిరువనంతపురం-న్యూ ఢిల్లీ కేరళ ఎక్స్‌ప్రెస్ రైలు బయలుదేరే సమయాన్ని 7 గంటలకు పైగా రీషెడ్యూల్ చేసినట్లు దక్షిణ రైల్వే ఇటీవలే తెలిపింది. కేరళ ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ అధికారులు.. ప్రజల కోసం అత్యవసర నంబర్‌ను కూడా జారీ చేశారు.

దక్షిణ భారతదేశంలోని తమిళనాడు మీదుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అక్టోబరు 14-18 మధ్య కేరళ, మహే మీదుగా.. అక్టోబర్ 15న లక్షద్వీప్ మీదుగా 30-40 kmph వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టు తెలిపింది.